Diwali Celebration in White House : అమెరికా అధ్యక్ష అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, అధికారులతో సహా 600 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్ సమాజాన్ని బైడెన్ కొనియాడారు.
"అధ్యక్షుడి హోదాలో వైట్‌హౌస్‌లో అతిపెద్ద దీపావళి వేడకను నిర్వహించడం నాకు గౌరవంగా ఉంది. దక్షిణాసియా అమెరికన్లు నా సిబ్బందిలో కీలక సభ్యులు. ప్రపంచంలో అన్ని రంగాల్లో అత్యంత వేగంగా దక్షిణాసియా అమెరికన్లు అభివృద్ధి చెందుతున్నారు. పరిపాలనలో అందరూ సహకరించారు. 2016 నవంబర్‌లో దక్షిణాసియా అమెరికన్లపై ద్వేషం, శత్రుత్వం ఏర్పడింది. అప్పుడే జిల్ బైడెన్, నేను మొదటి దీపావళి వేడులను వైస్ ప్రెసిడెంట్ నివాసంలో నిర్వహించాం. అప్పుడు ఐరిష్ కాథలిక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు హాజరయ్యారు. ఇప్పుడూ దీపావళి వేడుకలు గర్వంగా, ఘనంగా శ్వేతసౌధంలో జరుగుతున్నాయి."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
'కమల స్మార్ట్, నమ్మదగిన నాయకురాలు'
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఆమెను 2020లో తన రన్నింగ్ మేట్‌గా ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. కమల హారిస్‌ను స్మార్ట్‌గా అభివర్ణించారు. ఆమె విశ్వసనీయ నాయకురాలని పేర్కొన్నారు. దేశ సేవలో డొనాల్డ్ ట్రంప్ కంటే కమలకు సుదీర్ఘమైన అనుభవం ఉందని కొనియాడారు.
"నా భార్య జిల్ బిడెన్ దీపావళి వేడుకల్లో పాల్గొనాలని కోరుకుంది. కానీ ఆమె విస్కాన్సిన్కు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. కమల కూడా ఎన్నికల ర్యాలీలో బిజీగా ఉన్నారు. కమల హారిస్ చాలా స్మార్ట్. నమ్మదగిన వ్యక్తి కూడా" అని జో బైడెన్ వ్యాఖ్యానించారు.
అంతరిక్ష కేంద్రం నుంచి సునీత ప్రత్యేక సందేశం
వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రత్యేక సందేశాన్ని పంపారు. భారతీయ అమెరికన్ యూత్ యాక్టివిస్ట్ సుశ్రుతి అమూల, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ హెచ్.మూర్తి తదితరులు ప్రసంగించారు. శ్వేతసౌధంలోని బ్లూరూమ్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ప్రచార కార్యక్రమాల కారణంగా వైట్ హౌస్ లో జరిగిన దీపావళి వేడుకలకు హాజరుకాలేదు.
Happening Now: President Biden delivers remarks at a White House celebration of Diwali. https://t.co/gTKjvtzCEi
— The White House (@WhiteHouse) October 28, 2024