China On Arunachal Pradesh : ఇటీవల అరుణాచల్ తమదేనంటూ వ్యాఖ్యలు చేసిన చైనా- మరోసారి నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ, డ్రాగన్ దేశం మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన తరుణంలో చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్‌ను ఇండియా అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది.
"భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదు. గతంలో అరుణాచల్ చైనాలో భాగంగా ఉండేది. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. దాన్ని 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్‌గా రూపొందించుకుంది" అని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. భారత్ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని, దీనిపై చైనా వైఖరిలో మార్పు లేదన్న మొండి వాదనను కొనసాగించారు.
ఇటీవల అరుణాచల్‌లో నిర్మించిన సేలా సొరంగాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ అక్కడ పర్యటించారు. దీంతో ఉలిక్కిపడిన చైనా అది తమ భూభాగమేనని చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మాట్లాడటం గత నెల రోజుల్లో ఇది నాలుగోసారి. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా బదులిస్తోంది.
'ఇది కొత్త విషయం కాదు. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా వాటిని మరింత పెంచింది. అవి మొదటినుంచీ హాస్యాస్పదంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే' అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల పేర్కొన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన సౌత్ ఏషియన్ స్టడీస్‌లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఇలా సమాధానమిచ్చారు.
'నిరాధార వాదనలు వల్లె వేస్తే వాస్తవాలు మారవు'
విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా, అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన అసంబద్ధమైన వాదనలు పూర్తిగా నిరాధారామైనవని భారత్ స్పష్టం చేసింది. భారత్‌లో ఆరుణాచల్ ప్రదేశ్ విడదీయరాని భాగమని తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ఫలాలను అరుణాచల్ ప్రజలు లబ్ది పొందుతూనే ఉంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన అసంబద్ధమైన వాదనలను తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఇలాంటి వాదనలను మళ్లీ మళ్లీ వల్లె వేసినా అవి చెల్లుబాటు కావని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
హోలీ వేళ ఆకాశంలో అద్భుతం! మార్చి 25న చంద్రగ్రహణం విశేషాలివే! - Lunar Eclipse on Holi