Biden Comments On US Politics : యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఓవల్ ఆఫీస్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో రాజకీయ హింస ముప్పు పెరుగుతోందని ఆయన హెచ్చరించారు. దీన్ని చల్లబర్చడానికి ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాలు ఎంత ఉచ్ఛస్థితికైనా వెళ్లే అవకాశం ఉందని, కానీ హింసకు దారితీసే వరకు దిగజారొద్దని హితవు పలికారు. ఈ తరహా ఘటనలు సాధారణంగా మారేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని చెప్పారు. బైడెన్ దాదాపు ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేదిక నుంచి ఆయన మాట్లాడడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
మిల్వాకీలో సోమవారం రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభం కానున్నట్లు బైడెన్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆయన పార్టీ అధికారికంగా ఖరారు చేయనుంది. దీంతో ఆ కార్యక్రమంలో తనతోపాటు డెమోక్రాటిక్ పార్టీపై విమర్శలు ఉంటాయని తెలిపారు. దేశ భవిష్యత్తుపై వారి ప్రణాళికలేంటో కూడా వివరిస్తారని అన్నారు. మరోవైపు తాను కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకోవడం సహజమని గుర్తుచేశారు. కానీ అది శ్రుతిమించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
#WATCH | Washington DC: While addressing the nation, US President Joe Biden says, " ...the republican convention will start tomorrow. i have no doubt they'll criticize my record and offer their own vision for this country. i'll be travelling this week making the case for our… pic.twitter.com/NBSf2658bw
— ANI (@ANI) July 15, 2024
మనం శత్రువులం కాదని, సహోదరులమని బైడెన్ పేర్కొన్నారు. వాద- ప్రతివాదాలు, విమర్శలు సహజమని చెప్పారు. చివరకు మన విభేదాలను బ్యాలెట్ బాక్సుల ద్వారా తేల్చుకుంటామని వివరించారు. "అమెరికా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చలు చిత్తశుద్ధితో జరుగుతాయి. చట్టాలకు గౌరవం దక్కుతుంది. మర్యాద, నిజాయతీ ఇవన్నీ కేవలం భావాలు కావు. ఇక్కడ వాస్తవరూపంలో దర్శనమిస్తాయి" అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి కష్టసమయంలో యావత్ దేశం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని బైడెన్ పిలుపునిచ్చారు. ఈ ఘటనపై వేగంగా, సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. కాల్పులకు తెగబడిన దుండగుడి లక్ష్యం, అతడి గుర్తింపునకు సంబంధించి ప్రజలు తొందరపడి ఎలాంటి అంచనాలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.