Bangladesh Reservation Issue : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1971లో జరిగిన బంగ్లా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఇస్తున్న 30శాతం కోటాను 5శాతానికి తగ్గించింది. 93శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. మరో 2శాతం కోటా మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ఉద్యోగాల్లో కోటా కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేయడం వల్ల బంగ్లా ప్రభుత్వం 2018లో నిలుపుదల చేసింది. జూన్‌లో బంగ్లాదేశ్ హైకోర్టు ఆ కోటాను తిరిగి అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు, 93శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా విద్యార్థులు ఆందోళనలు విరమించి తరగతులకు హాజరుకావాలని బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో వారం రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
దేశమంతా కర్ఫ్యూ
అంతకుముందు విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడం వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. వారం రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 150మందికిపైగా చనిపోగా వందలసంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్యతోపాటు గాయపడ్డ వారి వివరాలను బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.
వారం క్రితం ఢాకా విశ్వవిద్యాలయం కేంద్రంగా మొదలైన విద్యార్థుల ఆందోళనలు దేశమంతా విస్తరించాయి. నిరసనలో భాగంగా రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం వల్ల రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపైకి రాళ్లు రువ్వడం వల్ల పరిస్థితులు అదుపుతప్పాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు, రబ్బర్ బుల్లెట్లు, పొగగ్రనైడ్లను ప్రయోగించారు. శనివారం కూడా విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకరూపం దాల్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆది, సోమవారాలను సెలవు దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
బంగ్లాలో కర్ఫ్యూ ఉన్నా కల్లోలమే- మరో 43మంది మృతి- జైలు నుంచి 800మంది పరార్! - Bangladesh Violence
బంగ్లాదేశ్‌లో చల్లారని ఉద్రిక్తతలు- దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సర్కార్