Nigeria Boat Capsizes : ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడి కనీసం 200 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
'శుక్రవారం ఉదయం తెల్లవారుజామున సుమారు 200 మంది ప్రయాణికులున్న బోటు కోగి రాష్ట్రం నుంచి పొరుగున్న ఫుడ్ మార్కెటింగ్‌కు బయలుదేరింది. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తు పడవ నైజర్ నదిలో బోల్తా పడింది. దీనితో పడవలో ఉన్న ప్రయాణికులు అందరూ నీటిలో పడిపోయి గల్లంతు అయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం' అని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు.
కనీసం 8 మంది మృతి!
'స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ దుర్ఘటనలో కనీసం 8 మంది మరణించారని, మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నట్లు' స్థానిక టెలివిజన్ ఛానల్ తెలిపింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో అధికారులు తెలపలేదు. కానీ పడవలో కనీసం 200 మందికి పైగా ప్రయాణికుల ఉన్నారని, కనుక ఓవర్ లోడ్ వల్లనే పడవ బోల్తాపడి ఉంటుందని స్థానిక మీడియా చెబుతోంది.
నైజీరియాలోని మారుమూల ప్రాంతాల్లో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మంచి రోడ్లు కానీ, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు కూడా పెద్దగా ఉండకపోవడం గమనార్హం.