Dissanayake Sworn As Sri Lankan President : శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. కొలంబోలోని రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య 56 ఏళ్ల దిసనాయకేతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆర్థిక సంక్షోభం తర్వాత జరిగిన తొలి ఎన్నికలు
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, అవినీతిని నిర్మూలిస్తారనే ప్రజల ఆకాంక్షల మధ్య దిసనాయకే శ్రీలంక అధ్యక్ష పీఠం ఎక్కారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఎన్పీపీ నాయకుడైన దిసనాయకే, తన సమీప ప్రత్యర్థి, ఎస్జేబీ నాయకుడైన సాజిత్ ప్రేమదాసపై గెలుపొందారు. 2022లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో దిసనాయకే ఘనవిజయం సాధించారు.
గత ఎన్నికల్లో ఢీలా- ఈ సారి సూపర్ సక్సెస్!
గత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన దిసనాయకే, ఈ ఎన్నికల్లో మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, జవాబుదారీతనాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్సే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకుని ఉన్న పరిస్థితుల్లో, వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను, అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకున్నారు. ఆ విధంగా అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకుని 42.31 శాతం ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాసపై సంచలన విజయం సాధించారు.
రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపు
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటగా తొలి ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పటికీ, అందులో విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో గెలుపును నిర్ధరించేందుకు రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. ఇందులో కుమార దిసనాయకే విజయం సాధించారు.
ప్రజల తీర్పును గౌరవించి, శాంతియుతంగా అధికార మార్పిడిని సులభతరం చేసినందుకు రణిల్ విక్రమసింఘేకు దిసనాయకే కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన తన తొలి ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే అధ్యక్ష ఎన్నికల అనంతరం దేశంలో అధికార మార్పిడిలో భాగంగా ప్రధాని దినేశ్ గుణవర్దన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్నిగంటల వ్యవధిలోనే శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణం చేశారు.