America On CAA Notification : పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం తమను ఆందోళనకు గురిచేస్తోందని తెలిపింది. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం చెప్పారు. "మార్చి 11న వచ్చిన CAA నోటిఫికేషన్‌పై మేం ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూల సూత్రం." అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు మిల్లర్ సమాధానమిచ్చారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా, వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ-2019ను తీసుకొచ్చింది. దీనికి 2019లోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించాయి. కానీ, విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కారణంగా దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు దీని అమలు విధివిధానాలను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల ముస్లింల పౌరసత్వం పోదని కేంద్రం స్పష్టం చేసింది.
'CAAను వెనక్కి తీసుకునేదే లేదు'
పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీపడబోమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొందరిని వేరుగా ఉంచడం ఈ చట్టం ఉద్దేశం కాదన్నారు. 1947లో మతం ఆధారంగానే దేశ విభజన జరిగిందన్న అమిత్ షా, వలస వెళ్లినవారు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల ముందే సీఏఏను ఎందుకు అమలు చేస్తున్నారన్న విమర్శలను కొట్టిపారేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫేస్టోలోనే సీఏఏను అమలు చేస్తామని బీజేపీ చెప్పిందని గుర్తుచేశారు. పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ కొవిడ్ కారణంగానే సీఏఏ అమలు ఆలస్యమైనట్లు వివరించారు. గత నాలుగేళ్లలో 41 సార్లు ఎన్నికల కంటే ముందే సీఏఏను అమలు చేస్తామని తాను చెప్పినట్లు అమిత్ షా వెల్లడించారు.
'CAAను చూసి భారతీయ ముస్లింలు భయపడొద్దు- హిందువులతో సమానంగా వారికి హక్కులు'
CAA కొత్త పోర్టల్ ప్రారంభం- త్వరలో మొబైల్ యాప్ కూడా- కావాల్సిన పత్రాలివే!