Afghan Taliban Execution : అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రాతియుగం నాటి శిక్షలను అమలు చేస్తున్నారు. ఘజనీ నగరంలోని ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరికి బహిరంగ మరణశిక్ష అమలు చేశారు. వేలాదిమంది చూస్తుండగా ఇద్దరిని పిట్టల్లా కాల్చి చంపేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో వీరికి అక్కడి సుప్రీంకోర్టు షరియా చట్ట ప్రకారం శిక్ష విధించింది. ఈ శిక్ష అమలును చూసేందుకు వేలాదిమంది తరలివెళ్లారు. క్షమాభిక్ష ప్రసాదించాలని దోషుల కుటుంబీకులు వేడుకున్నా తాలిబన్లు కనికరించలేదు. ఒకరి శరీరంలో 8 మరొకరి దేహంలో 7 తూటాలను దింపారు. ఇటీవల దొంగతనం చేసిన కేసులో నలుగురి చేతులను కాందహార్ ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రజలందరు చూస్తుండగా తాలిబన్లు దారుణంగా నరికేశారు. సరైన న్యాయవిచారణ లేకుండా శిక్షలు విధిస్తున్నారని అఫ్గాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దోషులను బహిరంగంగా శిక్షించిన తాలిబన్లు
కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. పలు నేరాలకు సంబంధించి మహిళలతో సహా మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్షించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు. ఈశాన్య ప్రాంతమైన తఖార్ ప్రావిన్సులోని తలూఖన్ నగరంలో మొత్తం 19 మందికి కొరడా దెబ్బలు విధించగా అందులో 10మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు అధికారి అబ్దుల్ రహీం రషీద్ వెల్లడించారు. గతేడాది నవంబర్ 11న మత పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలోనే ఈ శిక్ష అమలు చేశామన్నారు. గతేడాది ఆగస్టులో అఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత కొరడా దెబ్బలతో శిక్షించినట్లు తాలిబన్లు అధికారికంగా వెల్లడించడం అదే తొలిసారి కావడం గమనార్హం. 1990ల్లో అఫ్గాన్ పౌరులపై తమ ప్రతాపాన్ని చూపిన తాలిబన్లు న్యాయస్థానంలో శిక్ష పడిన వారిని బహిరంగంగా ఉరితీయడం, కొరడా దెబ్బలతో శిక్షించడం, రాళ్లతో కొట్టడం వంటి దారుణాలకు పాల్పడేవారు. గతేడాది తమ బలగాలను అమెరికా ఉపసంహరించురించుకున్న తర్వాత తాలిబన్లు మళ్లీ ఆ ప్రాంతాన్ని వశం చేసుకున్నారు.
30 రోజుల గడువు పూర్తి.. అఫ్గాన్‌లో బ్యూటీ సెలూన్లు బంద్! వేల మంది మహిళలపై ఎఫెక్ట్
మహిళలకు నరకం చూపిస్తున్న తాలిబన్లు.. ఇంట్లోంచి కాలు బయటపెడితే!