2024 US Elections Trump : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనతో
అమెరికా అధ్యక్ష ఎన్నికల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ప్రైమరీ ఎన్నికలు, ప్రెసిడెన్షియల్ డిబేట్‌లలో స్పష్టమైన పైచేయి సాధించిన ట్రంప్, ఇప్పుడు హత్యాయత్నం జరగడం వల్ల ప్రజల సానుభూతిని కూడా దక్కించుకున్నారు! ఈ పరిణామం నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు బాగా కలిసొస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో జరిగిన హత్యాయత్నం ఘటన అనంతరం ట్రంప్‌కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగిందని పోల్‌స్టర్ తాజా నివేదికలో వెల్లడించింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దాటేసి ముందంజలోకి ట్రంప్ దూసుకెళ్లారని విశ్లేషించింది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70శాతం ఛాన్స్‌లు ఉన్నాయని పేర్కొంది. గత కొన్నివారాల వ్యవధిలో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి విరాళాలు పెరిగిన విషయాన్ని ఇందుకు స్పష్టమైన సంకేతంగా పోల్‌స్టర్ అభివర్ణించింది. ఈమేరకు అమెరికా మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
బుల్లెట్లు దూసుకొచ్చినా నినాదాలు!
తనపై బుల్లెట్లు దూసుకొచ్చినా ట్రంప్ భయపడలేదు. ఆ వెంటనే ఆయన పైకి లేచి 'ఫైట్ ఫైట్' అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజన్లు ట్రంప్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విధమైన ఆత్మస్థైర్యాన్ని చూపించి అమెరికా ప్రజల ప్రజాభిమానాన్ని మరింత ట్రంప్ సొంతం చేసుకున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ఘటన ఎలా జరిగింది?
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ముందస్తు ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిగాయని ప్రస్తుతానికి లభించిన ఆధారాలను బట్టి స్పష్టం అవుతోంది. బట్లర్ నగరంలో ట్రంప్ సభాస్థలి అనేది గన్‌మెన్ పొజిషన్ తీసుకొన్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ వచ్చే సమయానికే అతడు ఓ భవనం పైకప్పు ఎక్కి గన్‌ను స్టాండ్‌పై సెట్ చేసుకొని, పొజిషన్ తీసుకొని రెడీగా కూర్చున్నాడు. ట్రంప్‌పై కాల్పుల కోసం నిందితుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను వాడాడు. దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్. వయసు 20 ఏళ్లు. అతడు బట్లర్ నగర వాస్తవ్యుడే అని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసును నమోదు చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ట్రంప్‌పై దాడి జరగొచ్చనే అనుమానంతోనే ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు.
మాజీ అధ్యక్షుడిని కాపాడిన 50పేజీల స్పీచ్ పేపర్లు- బుల్లెట్ తగిలినా ఆగని ప్రసంగం! - US Elections