Unwanted Hair on Face Reason: కొందరు యువతలు, మహిళల ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. కొన్ని టిప్స్ ద్వారా వాటిని తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కారణాలు ఇవీ..
అడ్రినల్ గ్రంథుల్లో సమస్యల వల్ల కొందరు మహిళల్లో కార్టిసాల్ చాలా తక్కువగా విడుదల అవుతుంటుందని.. దీన్నే 'అడ్రినల్ హైపర్‌ప్లేసియా' అని పిలుస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విడుదల కావాల్సిన స్థాయిలో.. కార్టిసాల్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వారిలో మగవారి మాదిరిగా గడ్డం పెరిగే అవకాశం ఉంటుందట. అయితే.. ఈ సమస్య పదిహేనువేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. కార్టిసాల్ తక్కువైనప్పుడే కాకుండా.. అవసరానికి మించి విడుదలైనా కూడా ముఖంపై అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంటుందట. దీన్ని 'కషింగ్ సిండ్రోమ్' అని పిలుస్తుంటారు. పలు అనారోగ్య కారణాల వల్ల స్టెరాయిడ్లు తీసుకొనే వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్తమా.. వంటి సమస్యలకు చికిత్స తీసుకొనే క్రమంలో ఉపయోగించే మందుల కారణంగా కూడా ఈ సమస్య ఎదురవ్వచ్చట.
ఇంకా కొందరిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్ సమస్య తలెత్తుతుందని.. ఫలితంగా కొందరిలో గడ్డం పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే.. ఈ మందులు కొందరిలో ఆండ్రోజెన్ విడుదల స్థాయిని పెంచుతాయట. ఇలాంటి వారిలో సైతం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇవే కాకుండా బరువు అధికంగా ఉన్నవారిలోనూ ముఖంపై వెంట్రుకలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
2020లో Journal of Clinical and Aesthetic Dermatology ప్రచురితమైన జర్నల్ ప్రకారం.. మహిళల్లో గడ్డంపై అవాంఛిత రోమాలు రావడానికి ఆండ్రోజెన్ హార్మోన్ ముఖ్య కారణమని వెల్లడించారు. పురుష హార్మోన్లైన ఇవి.. కొందరిలో అవసరానికి మించి విడుదల అవుతుంటాయని చెప్పారు. ఇలాంటి వారిలో గడ్డం, పైపెదవిపై వెంట్రుకలు పెరిగే అవకాశాలుంటాయని వివరించారు. "Hirsutism: A Review of the Literature" (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అనే అంశంపై చేసిన పరిశోధనలో University of Californiaలో Dermatology వైద్యులు Rohini V. Shah పాల్గొన్నారు.
ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు!
సాధారణంగా శరీరంపై వచ్చే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, షేవింగ్, త్రెడింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తుంటారు. వీటితోపాటు నిపుణుల సలహా మేరకు లేజర్, ఎలక్ట్రాలిసిస్ పద్ధతులతో పాటు పలు రకాల క్రీములు వంటివి ఉపయోగిచడం వల్ల అవాంఛిత రోమాలకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. అలాగే కొంతమంది మహిళల్లో అధిక బరువు కారణంగా కూడా ఈ సమస్య తలెత్తంది కాబట్టి.. బరువు తగ్గించుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. సహజ సిద్ధమైన పద్ధతుల్ని పాటించాలి అనుకునే వారు నిపుణుల సలహాతో పసుపు, షుగర్ వ్యాక్స్, కార్న్ స్టార్చ్.. వంటివి ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.