Why Stones Form In Gallbladder : ప్రస్తుత కాలంలో చాలామంది గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వల్ల కడుపు కుడి పైభాగాన హఠాత్తుగా, తీవ్రమైన నొప్పి వస్తుంది. కొంత మందికి అత్యవసరంగా సర్జరీ కూడా చేస్తుంటారు. మరి.. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పిత్తాశయం ఎలా పనిచేస్తుంది ?
లివర్ కింది భాగంలో పిత్తశయం అతుక్కుని ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో కొవ్వులు అధికంగా ఉంటే.. వాటిని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే తిన్న ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు గాల్‌బ్లాడర్‌లోకి వెళ్తాయి. ఇందులో నుంచి ఉత్పత్తి అయిన పైత్యరసం.. కొవ్వును చిన్నచిన్న భాగాలుగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పిత్తాశయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే అది గట్టిపడి రాళ్లలాగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇవి ఇసుక రేణువు అంత పరిమాణం నుంచి మొదలై.. గోల్ఫ్ బాల్ అంత సైజ్ వరకు పెరుగుతాయని పేర్కొన్నారు. పిత్తాశయం నుంచి స్టోన్స్ పిత్త వాహికలోకి ప్రవేశిస్తే.. కామెర్లు, ప్యాంక్రియాస్ వాపు సమస్యలకు దారితీస్తుందని తెలియజేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్యను గుర్తించకపోతే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందట.
పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
- ప్రస్తుతం కాలంలో మనం తినే ఆహారం, అలవాట్ల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడుతున్నాయి.
- అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ ఏర్పడతాయి.
- డయాబెటిస్, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడటం వల్ల కూడా రాళ్లు వస్తాయి.
- అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ రాకుండా వాడే మాత్రల వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
- కొంత మంది ఇంటి పనులు, పని ఒత్తిడి కారణంగా సరైన టైమ్‌కు భోజనం చేయరు. ఇలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పిత్తాశయంలో కొవ్వు స్థాయిలు పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రాళ్లు ఏర్పడతాయని అంటున్నారు.
- రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి ఆహారంలో నూనె, మసాలాలను తక్కువగా తీసుకోవాలి.
పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ?
- ఈ సమస్యతో బాధపడే చాలా మందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఎప్పుడైతే పిత్తాశయంలో విడుదల చేసే పైత్యరసానికి స్టోన్స్ అడ్డుపడతాయో అప్పుడు కడుపు నొప్పి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- 2020లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి కడుపునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
- అలాగే పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె.జగన్మోహనరావు చెబుతున్నారు.
- ఈ సమస్యతో బాధపడేవారిలో వాంతులు, వికారం, జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయని, అలాగే కుడి భుజం నొప్పిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- ఈ లక్షణాలు కనిపిస్తే.. తప్పకుండా అల్ట్రా సౌండ్ పరీక్ష చేయించుకోవాలి. స్టోన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే సర్జరీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగిస్తారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.