Photic Sneeze Reflex Treatment : చీకటిగా ఉన్న భవనం నుంచి సూర్యకాంతిలోకి అడుగు పెట్టినప్పుడు, ఎండలో ఉన్నప్పుడు మీకు సడెన్‌గా తుమ్ములు వస్తున్నాయా? అయితే ఈ సమస్య మీకు ఒక్కరికే లేదు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు! అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణాలేంటి? ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలో ఉంటే తుమ్ములు ఎందుకు వస్తున్నాయా?
మనం సూర్యకాంతిలోకి అడుగుపెట్టగానే ఆటోమెటిక్‌గా జరిగే ఈ అసంకల్పిత చర్యని 'ఫోటిక్ స్నీజ్ రిఫ్లెక్స్' (Photic Sneeze Reflex) అంటారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలోనే దీన్ని గమనించారు. క్లీవ్ లాండ్ క్లినిక్(లాభాపేక్షలేని అమెరికన్ వైద్య విద్యా కేంద్రం) ప్రకారం ఈ ఫోటిక్ స్నీజ్ను 'ఆటోసోమల్ డామినెంట్ కంపెల్లింగ్ హీలియో-ఆఫ్తాల్మిక్ ఔట్‌బర్స్ట్ సిండ్రోమ్(Autosomal Dominant Compelling Helio-Ophthalmic Outburst Syndrome or ACHOO)" అని కూడా పిలుస్తారు. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ అసంకల్పిత చర్య అనేది ఆటోసోమల్ డామినెంట్ జెనెటిక్ లక్షణం, అంటే ఒక వ్యక్తి తన తల్లిదండ్రులలో ఎవరి నుంచైనా దీన్ని వారసత్వంగా పొందే అవకాశం 50% ఉంటుంది.
"సాధారణంగా సూర్యకాంతి, చీకతి గదిలో లైట్స్ ఆన్ చేసినప్పుడు వచ్చే కాంతివంతమైన వెలుగుకు మానవ శరీరం ఎక్స్పోజ్ అయినప్పుడు ఫోటిక్ స్నీజింగ్ జరుగుతుంది. ప్రత్యేకమైన లైట్ వెలుగు వేవ్‌లెంగ్త్ వల్ల ఈ చర్య జరగదు. లైట్ ఇంటెన్సిటీలో మార్పు వచ్చినప్పుడు ఇది జరుగుతుంది." అని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ రెస్పిరేటరీ ఇన్‌స్టిట్యూట్‌లోని అలెర్జీ, క్లినికల్ ఇమ్యునాలజీ విభాగం ఛైర్మన్ డాక్టర్ డేవిడ్ లాంగ్ తెలిపారు.
1995లో అలబామా కంటి క్లినిక్‌లో 370మందిపై జరిపిన ఒక అధ్యయనంలో 33% మంది ఫోటిక్ తుమ్ముల సమస్య ఎదుర్కొన్నట్లు కనుగొన్నారు. 2019లో చైనాలో జరిపిన అధ్యయనంలో 3,400 మందిలో 25% మందికి ఈ అసంకల్పిత చర్య అనుభవం ఉన్నట్లు తేలింది. అయితే ఈ తుమ్ములను ఏది ప్రేరేపిస్తుందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ స్పష్టత లేదు.
అయితే ముఖం మొత్తం తన శాఖలు వ్యాపించి ఉన్న ట్రైజెమినాల్ నాడి(Trigeminal Nerve)ని ప్రకాశవంతమైన వెలుగు ప్రేరేపించడం, ఈ ఫోటిక్ స్నీజ్కు కారణం అయ్యే అవకాశం ఉందని డేవిడ్ లాంగ్ చెప్పారు. ఇక కాలిఫోర్నియాలోని జన్యు పరీక్ష సంస్థ 23andMeకు చెందిన పరిశోధకులు 2010లో చేసిన అధ్యయనంలో, ఈ ఫొటిక్ స్నీజ్కు సంబంధించి రెండు ఉత్పరివర్తనాలను కనుగొన్నారు. 2019లో జపాన్‌లో చేసిన ఓ పరిశోధనలో ఫోటిక్ స్నీజ్ రిఫ్లెక్స్‌కు, మైగ్రేన్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది.
ఫోటిక్ స్నీజ్ నివారణ మార్గాలు
ఫోటిక్ స్నీజ్ రిఫ్లెక్స్ తీవ్రత అందరిలో ఒకేలా ఉండదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మారవచ్చు. కొంతమందికి, ఫోటిక్ తుమ్ములు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. మరికొంతమందికి, ప్రకాశవంతమైన వెలుగు వరుసగా అనేకసార్లు అనియంత్రిత తుమ్ములను కలిగిస్తుంది అని క్లీవ్‌లాండ్ క్లినిక్ పేర్కొంది. అయితే ఈ ఫోటిక్ స్నీజ్ను నివారించడానికి కొన్ని మార్గాలను చెప్పారు డాక్టర్ డేవిడ్ లాంగ్. అవేంటంటే?
- ఫోటిక్ తుమ్ములను నివారించడానికి ప్రధాన మార్గం మీరు బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం. సాధారణంగా అలెర్జీలను ప్రభావితం చేసే యాంటిహిస్టామైన్‌లు ఈ అసంకల్పిత చర్యను ప్రేరేపించవు.
- ముక్కులో ఉండే ఫిల్ట్రమ్(philtrum)కు వేలితో ఒత్తిడి అప్లై చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. అయితే ఇలా ఒత్తిడి చేయడం వల్ల ప్రకాశవంతమైన కాంతితో ట్రైజెమినాల్ నాడికి కలిగిన చికాకును తగ్గించవచ్చని 2019లో ఆస్ట్రేలియాలో చేసిన ఓ పరిశోధన తేల్చింది. అలాగే ఫోటిక్ స్నీజ్ రిఫ్లెక్స్‌కు కారణమయ్యే నాడి సిగ్నల్స్‌ను ప్రభావితం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చని తెలిపింది.