Avoid These Foods to Reduce High Uric Acid: ఈ మధ్య కాలంలో చాలా మందిని యూరిక్ యాసిడ్ సమస్య పట్టి పీడిస్తోంది. మహిళలు, పురుషులు అనే బేధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు డాక్టర్లను సంప్రదించి ఏవేవో మందులు వాడుతుంటారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. అయితే అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహార అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాలని.. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
యూరిక్ యాసిడ్ ఎలా ఏర్పడుతుంది: మనం సాధారణంగా తీసుకునే ఆహారంలోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెంది యూరిక్ యాసిడ్‌గా ఏర్పడుతుందని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత అంటున్నారు. ఇలా ఏర్పడిన యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడూ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుందని... కానీ కొన్ని సార్లు యూరిక్ యాసిడ్ ఎక్కువగా విడుదలై అంతే స్థాయిలో మూత్రం ద్వారా సరిగ్గా వెళ్లనప్పుడు ఈ సమస్య వస్తుందన్నారు. యూరిక్ యాసిడ్ విసర్జన సరిగ్గా జరగక అది రక్తంలోని నిలిచిపోతుందని చెప్పారు. అలా నిలిచిపోయిన యూరిక్ యాసిడ్ స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోయి హైపర్ యూరిసిమియాకు దారి తీస్తుందని వివరించారు. బరువు అధికంగా ఉన్నవారిలో ఈ యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు.
యూరిక్ యాసిడ్ ఎక్కువైతే: మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల అంత మంచిది కాదని చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ పెరగడం కిడ్నీలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఇది పెరగడం వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడడంతో పాటు హైబీపీ, కీళ్ల నొప్పులు, వాపు, నడవడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయి పెరగడం వల్ల దాదాపు 11ఏళ్ల ఆయుషు తగ్గే అవకాశం ఉందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయని వివరించారు. కాబట్టి యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు ఈ పదార్థాలు జోలికి వెళ్లొద్దంటున్నారు.
"మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్ల నుంచి ప్యూరిన్స్ అనే అమైనో యాసిడ్స్ జీవక్రియ జరిగి యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అయితే, మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం లేదా యూరిక్ యాసిడ్ బయటకు సరిగ్గా వెళ్లకపోవడం వల్ల హైపర్ యూరిసిమియాగా మారుతుంది. ఫలితంగా మన కాలి పెద్ద వేలు దగ్గర యూరిక్ యాసిడ్స్ పేరుకుపోతాయి. అలాంటి సమయంలో కాలి వేలు వాస్తుంది దీనినే గౌట్‌గా పిలుస్తారు. ఇది ఇంకా ఎక్కువ స్థాయిలో పేరుకుపోతే దీనిని గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఇది చాలా నొప్పిగా ఉంటుంది. అందుకోసమే ప్యూరిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. ఇవేకాకుండా గౌట్‌ను తగ్గించే పదార్థాలు కొన్ని ఆహారాల్లో ఉంటాయి. అలాంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం తప్పనిసరిగా రోజూ 3-4 లీటర్ల మంచినీరు తీసుకోవాలి."
--డాక్టర్ శ్రీలత, డైటీషియన్
యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు:
- కూల్ డ్రింక్స్
- ఆల్కహాల్
- రెడ్ మీట్
- సీ ఫుడ్
- ప్రాసెస్డ్ ఫుడ్స్
- బఠానీలు
- బచ్చలికూర
- వేరుశనగలు
- ఎండు ద్రాక్ష
యూరిక్ యాసిడ్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం:
- విటమిన్ సి ఆహారం
- సీజనల్‌గా వచ్చే పండ్లు
- కాఫీ, బ్లాక్ కాఫీ
- పాలకూర
- పాలు, పాల ఉత్పత్తులు
- ఎక్కవ మోతాదులో నీళ్లు తీసుకోవాలి
- బార్లీ నీరు
- గ్రీన్ టీ
- స్టాబెర్రీ సహా అన్ని రకాల బెర్రీలు
- రేగి పండ్లు
- నేరేడు పండ్లు
- చెర్రీలు
- ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారం
- మీల్మేకర్, మిల్క్ సహా సోయా ఉత్పత్తులు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అద్దాలు వాడితే కళ్లు దానం చేయకూడదా? నేత్రదానంపై వాస్తవాలివే! - Eye Donation Fortnight 2024