What is Fried Rice Syndrome: సాధారణంగా చాలా మంది.. రాత్రి వండిన ఆహారం మిగిలిపోతే మరుసటి రోజు ఉదయం వేడి చేసి తింటారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ సేవ్ అవుతుందని అనుకుంటారు. అయితే.. ఫుడ్ సేవ్ అవ్వడం అటుంచితే ఆహారం కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఆహారం తింటే నయం కాని రోగాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏమిటి ? దీని లక్షణాలు వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్: అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా విషాన్ని ఉత్పత్తి చేస్తుందట. దీంతో ఫుడ్ పాయిజన్ అవుతుందని చెబుతున్నారు. ఇటువంటి కలుషిత ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయని.. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా సాధారణంగా అన్నం, పాస్తా, నూడుల్స్, మాంసం, కూరగాయలు వంటి పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల పెరుగుతుందని చెబుతున్నారు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్‌కు బాసిల్లాస్ సెరెయస్ బ్యాక్టీరియా ప్రధాన కారణమని కనుగొన్నారు. కాలిఫోర్నియాలోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన 106 మంది వ్యక్తుల్లో ఎక్కువ మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలను అనుభవించారు. అయితే వీరిని పరిశీలించగా బాసిల్లాస్ సెరెయస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ లక్షణాలు కనిపించాయని.. ఈ బ్యాక్టీరియా రెస్టారెంట్‌లో వడ్డించిన అన్నంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ డేవిడ్ డబ్ల్యూ. గ్రోవర్ పాల్గొన్నారు.
బాసిల్లాస్ సెరెయస్ వల్ల సంభవించే లక్షణాలు:
- వాంతులు
- విరేచనాలు
- కడుపు నొప్పి
- జ్వరం
- తలనొప్పి వంటి ఈ లక్షణాలు సాధారణంగా ఆహారం తిన్న 6 నుంచి 10 గంటలలోపు కనిపిస్తాయని అంటున్నారు.
బాసిల్లాస్ సెరెయస్ బ్యాక్టీరియా వల్ల సంభవించే ఇతర ఆరోగ్య సమస్యలు:
గుండెలో ఇన్ఫెక్షన్ (ఎండోకార్డిటిస్): బాసిల్లాస్ సెరెయస్ గుండెలోని గది గోడలలో ఇన్ఫెక్షన్ (ఎండోకార్డిటిస్) కు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిలో జ్వరం, చలి, అలసట, గుండె నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అయితే ఇది చాలా అరుదుగా సంభవిస్తుందని అంటున్నారు. 2008లో Journal of Clinical Microbiologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బాసిల్లాస్ సెరెయస్ గుండెలోని గది గోడలలో ఇన్ఫెక్షన్ (ఎండోకార్డిటిస్)కు దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌లో క్లినికల్ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఎం. జాన్సన్, MD పాల్గొన్నారు.
రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్): మరొక అరుదైన సమస్య ఏమిటంటే.. ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి సెప్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుందని.. ఈ పరిస్థితుల్లో జ్వరం, చలి, వణుకు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
లివర్ ఫెయిల్యూర్: బాసిల్లస్ సెరియస్ తీవ్రమైన సందర్భాల్లో కాలేయ వైఫల్యాన్ని ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు. బాసిల్లాస్ సెరెయస్ కాలేయంపై దాడి చేయడం ద్వారా లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.