What is Body Dysmorphic Disorder: ఇతరులతో పోల్చుకుంటూ తమను తామే నిందించుకునే.. మానసిక సమస్యను బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ (BDD)గా పేర్కొంటున్నారు నిపుణులు. జాన్ హాప్‌కిన్స్ మెడిసిన్ డేటా ప్రకారం.. 100 మందిలో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా.. ఇద్దరూ దీని బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే మనసు అదుపు తప్పి తీవ్రమైన చర్యల వరకూ వెళ్తారని.. చివరకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదముందంటున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాడీ డిస్మోర్ఫియా అనే సమస్యతో చాలా బాధపడుతున్నట్టు తెలిపారు. అసలు "బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్" ఎందుకొస్తుంది? ఎలా గుర్తించాలి? చికిత్సలేమైనా ఉన్నాయా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ కారణాలు: ఈ సమస్యకు సరైన కారణాలు ఏంటి అన్న విషయంలో క్లారిటీ లేకపోయినా.. కొన్ని అంశాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
- వంశపారంపర్యంగా ‘బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్(BDD) వచ్చే అవకాశాలున్నాయని కొంతమందిపై జరిపిన పరిశోధనలో తేలినట్లు నిపుణులు అంటున్నారు.
- చిన్న వయసులో లైంగిక హింస, బాడీ షేమింగ్, బుల్లీయింగ్‌కు గురైన వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
- అందం, శరీరాకృతి.. వంటి వాటికి అధిక ప్రాధాన్యమిచ్చే తల్లిదండ్రులు, ఇతర పెద్దలు, కుటుంబ వాతావరణంలో పిల్లలు పెరగడం వల్ల కూడా వారిలో ఈ మానసిక సమస్య వచ్చే అవకాశం ఎక్కువని అంటున్నారు.
- కొంతమందిలో మెదడు పనితీరు-మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. 2006లో Biological Psychiatry జర్నల్ లో ప్రచురించబడిన.. "The neurobiology of body dysmorphic disorder" అనే అధ్యయనం ప్రకారం.. మెదడు నిర్దిష్ట ప్రాంతాలలో లోపాలు, సెరోటోనిన్ అండ్ డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల అసమతుల్యతలు బిడిడికి దోహదపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ Oliver Foa, పాల్గొన్నారు.
'ఇతర అబ్బాయిలలాగా నేనెందుకు లేను?' - ఆ సమస్యతో బాధపడ్డ కరణ్ జోహార్!
బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ లక్షణాలు: BDD తో బాధపడుతోన్న వారు ముందుగా తమలోని లోపాల్ని పదే పదే అద్దంలో చూసుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మితిమీరితే తమ అందంలోని లోపాల్ని ఇతరులతో పోల్చుకుంటూ మానసికంగా మరింత కుంగిపోతుంటారని అంటున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని అంశాల పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారంటున్నారు నిపుణులు. అవి..
- మొటిమలు, ముడతలు, జిడ్డుదనం, ఫేషియల్ హెయిర్, వక్షోజాల పరిమాణం, జుట్టు ఎక్కువ రాలిపోవడం.. వంటి విషయాల్లో తమను ఎదుటివారితో పోల్చుకుంటూ బాధపడుతుంటారని అంటున్నారు.
- తమలోని శారీరక లోపాల్ని పదే పదే అద్దంలో చూసుకొని బాధపడుతుంటారని.. ఆ లోపాల గురించే ఇంటర్నెట్లో వెతకడం, వాటికి సంబంధించిన సమాచారాన్నే చదవడం.. వంటివి చేస్తారని అంటున్నారు.
- ఏ పనిపైనా శ్రద్ధ పెట్టకపోవడం, నలుగురితో కలవకపోవడం, ఎప్పుడు చూసినా తమలోని లోపాల్ని చూసుకుంటూ ఏదో ఒక ధ్యాసలో ఉండిపోతుంటారని చెబుతున్నారు.
- అద్దంతోపాటు తమ ప్రతిబింబం కనిపించే ఉపరితలాలపై తమలోని లోపాల్ని పదే పదే చూసుకోవడం.. ఇది మితిమీరితే అద్దాన్నే అసహ్యించుకుని.. కోపంతో ఇంట్లో ఉండే అద్దాలను పగలగొట్టడం వంటివి చేస్తారని చెబుతున్నారు.
- తమలోని లోపాల్ని మేకప్, దుస్తులు, విగ్స్.. వంటి ప్రత్యామ్నాయాలతో కవర్ చేసుకుంటుంటారని వివరిస్తున్నారు.
- పదే పదే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తూ తమ శరీరంలోని లోపాలకు తగిన చికిత్స తీసుకుంటుంటారని.. తమలోని లోపాల్ని ఇతరులు గుర్తించకపోయినా.. వాటి గురించి ఇతరుల దగ్గర ప్రస్తావిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని తెలుపుతున్నారు.
నివారణ ఇదే: పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండడం, ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం, మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి ధ్యానం.. వంటివి వాటి వల్ల క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి:
అద్భుతం: ఈ పౌడర్ రోజూ ఒక్క చెంచా తీసుకుంటే - వెన్నునొప్పి మొదలు ఈ సమస్యలన్నీ పటాపంచల్!
అలర్ట్ : కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి! - లైట్ తీసుకుంటే అంతే!