Side Effects of Consumption High Sugar : సాధారణంగా మనం తీపి పదార్థాలను తిన్నప్పుడు.. అది మన మెదడులో రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. ఫలితంగా డోపమైన్, సెరోటోనిన్ వంటి కొన్ని న్యూరోట్రాన్స్‌మిటర్స్ మెదడు రివార్డు సిస్టమ్‌లో విడుదలవుతాయి. ఇవి రెండు మనల్ని సంతోషంగా, రిలాక్స్‌గా ఉండేలా దోహదపడతాయి. చక్కెర మితంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కానీ.. పరిమితికి మించి తీసుకుంటే మాత్రం అది హార్మోన్లలో అసమతుల్యతకు దారి తీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని కారణంగా.. మెదడుపై తీవ్ర ప్రబావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అధిక చక్కెర వినియోగం నిద్రలేమికి సైతం దారితీస్తుందంటున్నారు. బాడీ చక్కెరను జీర్ణం చేసినప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది నిద్రలేమి సమస్యను పెంచుతుందట.
అధిక చక్కెర వినియోగం మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. హై-షుగర్ పదార్థాలకు - డిప్రెషన్‌కు సంబంధం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 2017లో "Depression-Anxiety" అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. చక్కెర పానీయాలు ఎక్కువగా తాగే వ్యక్తులలో డిప్రెషన్ ప్రమాదం 23% ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
షుగర్ తినకపోతే - మీ శరీరంలో ఏం జరుగుతుంది?
చక్కెర వల్ల కలిగే హానిని తెలుసుకోవడానికి డాక్టర్ "నికోల్ అవెనా" ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు. రీసెర్చ్‌లో భాగంగా ఎలుకలకు నీళ్లు ఇవ్వకుండా షుగర్ వాటర్ ఇచ్చారు.ఆ తర్వాత పరిశీలిస్తే.. వాటి బ్రెయిన్‌పై ఒత్తిడి పెరిగిందని.. ఎలుకలు నీటిని ఎక్కువగా తాగడం ప్రారంభించాయని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత వాటికి సాధారణ నీరు ఇస్తే.. ఒత్తిడి కనిపించలేదని డాక్టర్ నికోల్ చెప్పారు.
బిహేవియర్ ఛేంజ్ : షుగర్ కారణంగా ప్రవర్తనలోనూ తేడాలు వస్తాయని చెప్పారు. ఎలుకలపై జరిపిన మరో పరిశోధనలోనే ఈ విషయం తేలిందని చెప్పారు. షుగర్ తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం పడి.. తెలివైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుందని తెలిపారు.
హిప్పోకాంపస్ : అధిక చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా.. హిప్పోకాంపస్ కూడా ఎఫెక్ట్ అవుతుందట. ఇది మెదడులోని ఒక భాగం. ఇది జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, భావోద్వేగాలకు సంబంధించింది.
జ్ఞాపక శక్తి సమస్యలు : చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుందని.. ఫలితంగా జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.