Health Benefits of Soaked Rice: మన దేశంలో అనేక మంది కడుపు నింపేది బియ్యమే. ఉత్తరాది భారతంలో గోధుమ పిండిని ప్రధాన ఆహారంగా భావించినా.. దక్షిణాది సహా కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా బియ్యాన్నే తీసుకుంటుంటారు. అయితే, చాలా మంది బియ్యాన్ని కడిగి వెంటనే అన్నం వండేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అవుతారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బియ్యాన్ని ఎక్కువ సేపు నానబెట్టి వండుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయని అంటున్నారు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
బ్లడ్ షుగర్ లెవెల్స్: మధుమేహం బాధితులు ఎక్కువగా అన్నాన్ని తినకూడదని పలువురు వైద్యులు చెబుతుంటారు. కారణం.. బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా పెరుగుతాయి. అయితే బియ్యాన్ని కడిగి వెంటనే వండకుండా.. కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఈ స్థాయులు తగ్గి షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మధుమేహులు అన్నం తిన్నా పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
పోషకాలను గ్రహిస్తుంది: మన శరీరానికి మేలు చేసే పోషకాలు అనేకం బియ్యంలో ఉన్నాయి. బియ్యాన్ని వండేముందు కాసేపు నీటిలో నానబెట్టి వండిన తర్వాత తినడం వల్ల ఈ పోషకాలన్నింటిని శరీరం శోషించుకుంటుంది.
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది: అనేకమందికి తిన్నది అరగకపోవడం, మలబద్దకం లాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు బియ్యాన్ని నానబెట్టి వండుకొని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా అన్నాన్ని వండడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.
2018లో ది జర్నల్ ఆఫ్ ఫుడ్ ఇంజినీరింగ్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బియ్యం ఎక్కువ సేపు నానబెట్టి వండటం వల్ల జీర్ణక్రియ మెరుగపడుతుందని, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోప్రొఫెసర్ డాక్టర్ Sungmin Lee పాల్గొన్నారు.
హాయిగా నిద్రపోతారు!: బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అదే మీరు బియ్యాన్ని నీటిలో నానబెట్టడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత వండిన అన్నాన్ని తినడం వల్ల మీకు రాత్రిళ్లు బాగా నిద్రపడుతుందని అంటున్నారు
అలా అని గంటలు నానబెట్టొద్దు!: అయితే, బియ్యాన్ని నానబెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువసేపు చేయడం కూడా మంచిది కాదు. ఇలా బియ్యాన్ని గంటలకు గంటలు నానబెడితే అందులోని విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. కాబట్టి సుమారు 15-20 నిమిషాలు మాత్రమే నానబెట్టాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.