Foods for Good Sleep: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. నిద్రలేమి కారణంగా అధిక బరువు మొదలు.. బీపీ, మధుమేహం వంటి ఎన్నో రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే రాత్రి పూట ఫోన్లు ఎక్కువ చూడటం, ఒత్తిడి, ఆందోళన.. ఇవన్నీ నిద్రలేమికి కారణాలు. అయితే ఇవి మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపైనా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారపు అలవాట్లు నిద్రలేమికి దారితీసి, దీర్ఘకాలంలో ఇన్సోమియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నీయా వంటి రుగ్మతలకు కారణమవుతాయని నూట్రిషినల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎరికా జన్సేన్ వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. ఈ క్రమంలోనే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలో 18 ఏళ్లు నిండిన వారిపై ఈ పరిశోధన చేశారు. అందులో తాజా పండ్లు, కూరగాయాలు తక్కువ మోతాదులో తిన్న వారు.. తక్కువ సమయం నిద్రపోయారని.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తిన్నవారంతా హాయిగా నిద్రపోయారని వెల్లడించారు. సరైన ఆహారం, నిద్ర రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని వివరించారు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని.. సుఖంగా నిద్రపోవడం వల్ల మంచి ఆహారం తీసుకుంటారని తెలిపారు.
తినకూడని ఆహారాలు
- ప్రాసెస్ చేసిన ఆహారం
- వేపుళ్లు
- బర్గర్లు
- సంతృప్త కొవ్వులు
- వైట్ బ్రెడ్
- పాస్తా
- రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్
- ఆల్కహాల్
- కెఫిన్
- రసాయనాలతో పండించిన ఆహారం
మంచి నిద్ర కోసం తీసుకోవాల్సి ఆహారం
- ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు
- ఆకుకూరలు
- ఆలివ్ నూనె
- మాంసం
- చేపలు
- డెయిరీ పదార్థాలు
- కివీ పండ్లు
- చెర్రీలు
- బెర్రీ పండ్లు
- ఐరన్, విటమిన్ ఉండే ఆహారం
రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడమే కాకుండా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుందని ఎరికా జన్సేన్ చెప్పారు. సుఖంగా నిద్రపోవడానికి ఈ ఆహారం, డ్రింక్ అంటూ ప్రత్యేకంగా ఉండదని.. రోజువారీ డైట్లో మార్పులతోనే సాధ్యమని చెప్పారు. ఆల్కహాల్, కెఫిన్ లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని తెలిపారు. నిద్రపోవడానికి సుమారు 3 గంటల ముందు అధిక ఆహారం తీసుకోకూడదని సూచించారు. దీంతో పాటు ఫోన్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను రాత్రి పూట వినియోగించకూడదని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.