Silent Heart Attack Causes and Symptoms: హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితినే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు. అయితే.. సాధారణంగా గుండె నొప్పి అంటే ఛాతీలో నొప్పి, ఎడమవైపు చేయి లాగడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఏమి లేకుండా కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. దీనినే సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటున్నారు నిపుణులు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు. కాబట్టి సైలెంట్ హార్ట్ ఎటాక్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? ఇది రావడానికి కారణాలు ఏంటి? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది?: చాలా మందికి లక్షణాలు బయటపడే గుండెపోటు వస్తుంది. ఏ లక్షణాలు లేకుండా, ఏ నొప్పి రాకుండా వస్తే దానిని ‘సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారని ప్రముఖ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనిల్ క్రిష్ణ జి అంటున్నారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు కూడుకపోతే ఇది వస్తుందని.. ఇది గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాల కొరతకు దారితీస్తుందని అంటున్నారు. అయితే ఈ రకమైన హార్ట్ ఎటాక్‌లో కూడా రకరకాల గ్రేడ్లు ఉన్నాయని అంటున్నారు. అంటే కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవని, మరికొందరికి ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడం వంటివి జరుగుతుంటాయని అంటున్నారు. వీటన్నింటిలో ఎలాంటి లక్షణాలు లేకుండా వచ్చేది డేంజర్ అని చెబుతున్నారు.
ఎవరికి వచ్చే అవకాశం:
- ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ డయాబెటిస్ పేషెంట్లకు వచ్చే అవకాశం ఎక్కువని డాక్టర్ అనిల్ క్రిష్ణ చెబుతున్నారు. ఇదే విషయాన్ని NIH బృందం కూడా స్పష్టం చేసింది.(రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి కూడా ఇది వచ్చే అవకాశం ఉందంటున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల గోడలపై చేరడం వల్ల రక్తనాళాలు అడ్డుపడతాయి. ఫలితంగా గుండెకు రక్తం సరిగా అందదు. రక్త ప్రవాహం తగ్గుదల వల్ల గుండె కణాలు నశించడం ప్రారంభమవుతాయని.. ఇది సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందని అంటున్నారు.
- అధిక రక్తపోటు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
- స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందని అంటున్నారు. ధూమపానం రక్తనాళాలను సంకోచింపజేసి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.
- కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా.. మిగిలిన వారికి కూడా వచ్చే అవకాశం ఎక్కువని అంటున్నారు.
నిశ్శబ్ద గుండెపోటు లక్షణాలు: చాలా మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చని.. కొంతమందిలో తేలికపాటి లక్షణాలు కనిపించవచ్చని అంటున్నారు. అవి చూస్తే..
- అలసట
- అజీర్ణం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- గుండె కొట్టుకునే వేగం పెరగడం
- ఛాతీలో తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యం
- కడుపు నొప్పి
- వికారం
- ఫ్లూ వంటి లక్షణాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్‌లను నివారించవచ్చని అంటున్నారు. అందుకోసం..
- కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
- రెగ్యులర్‌గా హెల్త్ చెకప్(బీపీ, షుగర్, కొలెస్ట్రాల్)లు చేయించుకోవడం. ఒకవేళ ఇప్పటికే హైబీపీ, షుగర్ ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడాలి.
- స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు మానేయడం
- ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి.
- వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి.
- గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్.. రెండూ ఒకటేనా..? వీటి నుంచి బయటపడడం ఎలా..?