Best Food for Pregnant Women: అమ్మతనం కోసం మహిళలు అందరూ ఎంతగానో ఆరాటపడుతుంటారు. గర్భం దాల్చిన నాటి నుంచి పాపాయి చేతిలోకి వచ్చే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పుట్టే బిడ్డ అందంగా.. ఆరోగ్యంగా జన్మించాలని ఆశ పడుతుంటారు. అయితే.. కొందరికి పుట్టుకతోనే పలు సమస్యలు వస్తుంటాయి. ఇందుకు జన్యుపరమైన అంశాలే కాకుండా తల్లి చేసే పొరపాట్లు కూడా కొంత వరకు కారణం కావొచ్చని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా తల్లి తీసుకునే ఆహారం కూడా అందుకు కారణమని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కారణాలు ఏంటి..? బిడ్డ వ్యాధుల నుంచి ఎలా తప్పించుకోవాలి..? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గర్భం దాల్చినప్పుడు సరైన డైట్ పాటించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ లతాశశి. ఇందువల్ల ముఖ్యంగా బిడ్డ బరువు పెరగడమే కాకుండా అనేక దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు. గర్భం దాల్చిన మహిళల్లోనూ నెలలు నిండకుండానే ప్రసవం, ఊబకాయం, జస్టేషనల్, బీపీ, షుగర్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే..
"సరైన మోతాదులో కొవ్వులు, ప్రొటీన్ తీసుకోకపోతే ఆ ప్రభావం బేబీ బరువు మీదే కాకుండా గుండె, కిడ్నీ వంటి అవయవాలపైనా కనిపిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మోనాష్ విశ్వవిద్యాలయం గర్భిణులపై చేసిన పరిశోధన మరెన్నో కీలక విషయాలనూ బహిర్గతం చేసింది. గర్భం దాల్చినప్పుడు హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుందట."
--డాక్టర్ లతాశశి, ప్రముఖ పోషకాహార నిపుణులు
అయితే, కేవలం పీచు ఎక్కువగా ఉండే ఒక్క రకం ఆహారాన్నీ తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని డాక్టర్ లతాశశి చెప్పారు. తృణ, చిరుధాన్యాలు, గింజలు, పప్పు దినుసులు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి వివిధ రకాల హై ఫైబర్ ఫుడ్ పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా దొరికే పండ్లను మాత్రమే తినాలని భావిస్తే.. వీటి నుంచి కేవలం డైటరీ ఫైబర్ మాత్రమే కాదు విటమిన్లు, ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందుతాయన్నారు. జాతీయ పోషకాహార సంస్థ సూచనల ప్రకారం- ఒక రోజుకి అవసరమైన 2000 కెలొరీ డైట్‌కి 40 గ్రాముల డైటరీ ఫైబర్ తప్పక తీసుకోవాలని పేర్కొన్నారు. నీళ్లు కూడా తగినన్ని తాగాలని.. అప్పుడే మీతో పాటూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.