TREATMENT FOR CONGENITAL SQUINT : మనిషికి కళ్లు కెమెరాలుగా పనిచేస్తాయి. కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ.. రెండూ ఒక దిశవైపు కదులుతూ ఒకే విజువల్ గ్రహించి మెదడుకు పంపిస్తాయి. ఆ దృశ్యాలను మెదడు మనకు తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. రెండు కనుగుడ్లూ సమన్వయంతో చూసేందుకు కంటి వెనక ఆరు కండరాలు పని చేస్తాయి. అయితే.. ఈ కండరాల్లో సమస్య వచ్చి, రెండు కనుగుడ్లలో సమన్వయం లోపించినపుడు ఒక్కొక్కటీ ఒకవైపు చూస్తుంది. దాన్నే మెల్ల కన్నుగా పిలుస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది.
అయితే.. మెల్లకన్నుకు చికిత్స చేసే అవకాశం ఉందని నేత్ర వైద్యులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగైన ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడం వల్ల.. సర్జరీలతో మెల్లకన్నును సరి చేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన పిల్లల కంటి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు.
మెల్లకన్నుకు చికిత్స ఎలా? :
- పిల్లల్లో ‘ఐ సైట్’ ఎక్కువగా ఉండి.. క్రాస్ అయిన కంటి చూపు తక్కువగా ఉందా? అన్న విషయాన్ని ముందుగా నిర్ధారించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యను ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు చూపు బాగా ఉన్న కన్నుని మూసేసి మెల్ల ఉన్న కన్నుని కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంటారని చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు.
- సాధారణంగా మెల్ల ఉన్నప్పుడు చూడడానికి ఒక కంటినే ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు ఎడమవైపు కంటితో చూసినప్పుడు కుడి వైపు కంటికి మెల్ల ఉంటుంది. కుడి వైపు కంటితో చూస్తున్నప్పుడు ఎడమవైపు కంటికి మెల్ల ఉంటుంది. ఒకవేళ రెండు కళ్లతో ఒకేసారి చూసినప్పుడు మెదడు దాన్ని ‘డబుల్ విజన్’గా గుర్తించి రెండు వస్తువుల్లాగా చూపిస్తుంది.
- ఇలా ఒక కంటితో చూడడం వల్ల అవతలి వారికి అందవికారంగా కనిపిస్తుంటుంది. అలాగే రెండు కళ్లూ ఒకేసారి ఉపయోగించకపోవడం వల్ల కొన్ని రకాల వస్తువులను సరిగా చూసే అవకాశం ఉండదు. ఇలాంటప్పుడు స్క్వింట్‌ని తప్పనిసరిగా కరెక్ట్ సరి చేయాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు.
అయితే.. ఈ చికిత్స విధానం మనిషిని బట్టి, సమస్య తీవ్రతను బట్టి మారుతుంటుంది. కాబట్టి.. పిల్లల్లో మెల్లకన్ను సమస్య ఉంటే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వారి సలహా మేరకు తగిన విధంగా చికిత్స అందిస్తే సమస్య నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు.