These Body Pains Can Indicate Heart Attack : ఒకప్పుడు గుండె పోటు, మధుమేహం వంటి వ్యాధులు కాస్త వయసు పైబడినవారిలో కనిపించేవి. కానీ, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు దాడి చేసి ప్రాణాలు హరిస్తున్నాయి. కాబట్టి, గుండెపోటు(Heart Attack)ను కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే గుర్తించి తగిన మందులు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. 5 బాడీ పెయిన్స్ విషయంలో అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.
ఛాతి నొప్పి : గుండెపోటు అత్యంత సాధారణ, ముఖ్యమైన లక్షణాలలో ఛాతి నొప్పి ఒకటని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఛాతి ఎడమవైపున లేదా మధ్యలో తేలికపాటి నుంచి అసౌకర్యమైన నొప్పి, ఒత్తిడి, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అలర్ట్ కావాలంటున్నారు. 2018లో 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ 'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. గుండెపోటుకు చికిత్స చేయించుకున్న రోగులలో 70% మంది ఒక రకమైన ఛాతి నొప్పిని అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాన్ ఈ. అమెరీ పాల్గొన్నారు. ఛాతి నొప్పి గుండెపోటును సూచించే అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతాలలో ఒకటని ఆయన పేర్కొన్నారు.
చేతి నొప్పి : ఒకటి లేదా రెండు చేతులలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం, అలాగే ఆ నొప్పి తరచుగా ఛాతీ నుంచి ఎడమ చేయి వరకు వ్యాపించడం వంటి లక్షణాలు అనుభవిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలంటున్నారు నిపుణులు. ఇది కూడా గుండెపోటుకు మరొక హెచ్చరిక సంకేతం కావొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు ఆ నొప్పి భుజాలు, వీపు రెండింటికీ వ్యాపిస్తుందంటున్నారు.
అలర్ట్ : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకు గుండెపోటు ప్రమాదం ఎక్కువ - వెల్లడించిన పరిశోధకులు!
గొంతు, దవడ నొప్పి : కొంతమందిలో ఈ పెయిన్స్ కూడా గుండెపోటును సూచించే ముందస్తు హెచ్చరిక సంకేతాలు కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు గొంతు లేదా కింద దవడలో నొప్పి రావచ్చు. అలాగే, ఈ నొప్పి.. పంటి నొప్పి, శ్వాస ఆడకపోవడం లేదా మెడలో ఒత్తిడి వంటి సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.
పొత్తికడుపు నొప్పి : బొడ్డు పైభాగంలో నొప్పి కొన్నిసార్లు గుండెపోటును సూచిస్తుందంటున్నారు నిపుణులు. ఇది నొప్పిగా, బిగుతుగా లేదా ఒత్తిడి లాగా అనిపించవచ్చంటున్నారు. అలాగే.. ఈ నొప్పి వాంతితో సంబంధం కలిగి ఉండవచ్చని చెబుతున్నారు.
నో పెయిన్ : దాదాపు 10శాతం గుండెపోటు సమస్యలు చాలా తేలికపాటి లేదా నొప్పిలేకుండా ఉండవచ్చంటున్నారు నిపుణులు. దీనిని సైలెంట్ మయోకార్డియల్ ఇస్కీమియా అని పిలుస్తారు. ఇది నార్మల్‌గా మధుమేహం, వృద్ధులు, నరాలవ్యాధి ఉన్న రోగులలో సంభవిస్తుందంటున్నారు. ఏదేమైనప్పటికీ, గుండెపోటు లక్షణాలు వివిధ వ్యక్తులలో విభిన్నంగా వ్యక్తమవుతాయని గుర్తుంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
పై లక్షణాలను కలిగి ఉండడంతో పాటు నిరంతరంగా చెమట, మైకము, ఆందోళనతో ఇబ్బందిపడుతున్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే.. ఆ టైమ్‌లో ECG, ECHO, బ్లడ్ టైటర్స్ వంటి కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా అది గుండెపోటు నొప్పినా లేక ఇతర ఏదైనా నొప్పినా అని తెలుసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.