Ayurvedic Herbs to Reduce Uric Acid : సాధారణంగా మనం తీసుకునే ఫుడ్స్, పానీయాలలో ప్యూరిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. వాటిని తీసుకున్నప్పుడు.. ఈ రసాయనం విచ్ఛిన్నం చెంది యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే, మూత్ర విసర్జన సరిగ్గా జరగనప్పుడు యూరిక్ యాసిడ్(Uric Acid) రక్తంలోనే నిలిచిపోతుంది. ఇలా యూరిక్ యాసిడ్ బయటకుపోని కారణంగా అది రకరకాల వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాడీలో యూరిక్ యాసిడ్ పేరుకోవడం వల్ల.. కీళ్ల నొప్పులు, గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
కాబట్టి, ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. సాధారణంగా దీని స్థాయిలను నియంత్రించడానికి వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తుంటారు. అయితే, మందులే కాదు కొన్ని ఆయుర్వేద మూలికలను డైలీ తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను సులభంగా తగ్గించుకోవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గిలోయ్ : ఈ మొక్కను గుడుచి, అమృతవల్లి అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అంతేకాకుండా, గిలోయ్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
గోక్షుర : దీనినే సాధారణంగా 'పంక్చర్ వైన్' అని కూడా పిలుస్తారు. ఇది మూత్రవిసర్జన, డిటాక్సిఫైయింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క యూరిక్ యాసిడ్‌తో సహా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేకాకుండా, ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర నాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందంటున్నారు నిపుణులు.
పునర్నవ : ఈ ఆయుర్వేద మొక్క సహజ మూత్రవిసర్జనకారిగా పనిచేస్తుంది. అలాగే, ఇది మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ తొలగింపును ప్రోత్సహిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేకాకుండా, ఇది మూత్రపిండాల పనితీరు, మూత్ర నాళాల ఆరోగ్యానికి మంచి తోడ్పాటు అందిస్తుందని చెబుతున్నారు. అలాగే శరీరంలో నీరు నిలుపుదల, ఉబ్బరాన్ని తగ్గిస్తుందంటున్నారు.
రాత్రివేళ పాదాల్లో నొప్పి? - ఇది తీవ్రమైన సమస్య కావొచ్చు!
త్రిఫల : ఇది ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఇది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పేగుల కదలికను మెరుగు పరుస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
2011లో 'Arthritis & Rheumatism' అనే జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. గౌట్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న వారు 12 వారాల పాటు రోజుకు 500 మిల్లీగ్రాముల త్రిఫల సప్లిమెంట్ తీసుకుంటే వారిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు పరిశోధకులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మూత్రం దుర్వాసన వస్తోందా? - అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం కావొచ్చు!