Symptoms of Liver Damage: చాలా మంది గుండె, కిడ్నీల పనితీరు బాగుండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇది మన కోసం ఎంతగానో కష్ట పడుతుంది. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నెన్నో పనులను నిర్వహిస్తుంది. అలాంటి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
విపరీతమైన అలసట : పనులు చేసినప్పుడు మాత్రమే కాకుండా.. లివర్ డ్యామేజ్ అవుతున్నట్లయితే విపరీతమైన అలసటకు గురవుతారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ టి. లక్ష్మీ కాంత్ అంటున్నారు. ఇలా అలసట అనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
కామెర్లు : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీ కళ్లు, చర్మం రంగు మారుతుందని అంటున్నారు. పచ్చగా మారితే కాలేయ సమస్య ఉన్నట్లే అంటున్నారు. అంటే.. కామెర్లు రావడం కూడా లివర్ ప్రాబ్లమ్‌ను సూచిస్తుందంటున్నారు. కాబట్టి మీలో కూడా ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ కావడం మంచిది అంటున్నారు.
30 ఏళ్లు దాటిన వారికి బిగ్ అలర్ట్ - ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ దెబ్బతింటున్నట్టే!
ఆకలి లేకపోవడం : లివర్ సమస్యతో బాధపడుతున్నట్లయితే కనిపించే మరో లక్షణం.. ఆకలి మందగించడమని డాక్టర్ టి. లక్ష్మీకాంత్ అంటున్నారు. అయితే.. అప్పుడప్పుడు ఇటువంటి సమస్య వచ్చినా ఏం కాదు కానీ..చాలా రోజులుగా ఏమి తినాలనిపించకపోయినా లేదా ఆకలి వేయకపోయినా అది లివర్ డ్యామేజ్‌కు సంబంధించిన సంకేతంగా అర్థం చేసుకోవచ్చంటున్నారు.
మూత్రం రంగులో మార్పు : సాధారణంగా మూత్రం రంగును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు. అయితే కాలేయం బాగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికీ ఇది ఉపయోగపడుతుందంటున్నారు. ముఖ్యంగా యూరిన్ నార్మల్ కలర్లో కాకుండా పచ్చగా లేదా మరే ఇతర రంగులో వస్తున్నా సందేహించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది లివర్‌లో సమస్య ఉందని తెలిపే సంకేతం కావొచ్చంటున్నారు.
వికారం : తరచూ వికారంగా ఉండటం, వాంతులు వంటి లక్షణాలు మీలో కనిపిస్తే ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ లక్షణాలు లివర్ ప్రాబ్లమ్‌ను సూచిస్తాయంటున్నారు. అలాగే చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వికారంగా ఉండటం లేదా వాంతులవడం లాంటివి జరుగుతుంటాయి. ఇది కూడా కాలేయ సమస్యకు సంకేతమని చెబుతున్నారు.
మీ చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లే!
మలబద్ధకం : ఈ లక్షణం కూడా కాలేయ సమస్యను సూచించే మరో ముఖ్యమైన సంకేతంగా సూచిస్తున్నారు. ఎందుకంటే లివర్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే అది జీర్ణక్రియపై ప్రభావం పడి అది మలబద్ధకానికి దారి తీస్తుందంటున్నారు.
చర్మ సమస్యలు : చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా? అయితే.. అది కూడా లివర్ సమస్యకు సంకేతమని సూచిస్తున్నారు డాక్టర్ టి.లక్ష్మీకాంత్. ముఖ్యంగా చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇవే కాకుండా లివర్‌లో సమస్య ఏర్పడినప్పుడు.. కడుపు నొప్పి, తరచుగా జ్వరం, ఏకాగ్రత లోపించడం, అతిసారం, చెడు శ్వాస వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మందు బాబులకు అలర్ట్ - లివర్ దెబ్బతినొద్దంటే ఆల్కహాల్ ఆ లిమిట్ దాటొద్దంట!