Difference Between Red And White Wine : మద్యం సేవించేవారు రకరకాల ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకుంటుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. వైన్. ఇదొక క్లాసిక్ డ్రింక్. అయితే, వైన్‌లో(Wine) కూడా చాలా వెరైటీలు ఉంటాయి. అందులో ఎక్కువ మందికి తెలిసినవి.. వైట్ వైన్, రెడ్ వైన్. ఇవి రెండూ ద్రాక్ష నుంచి తయారైనప్పటికీ ఈ రెండింటి మధ్య కొన్ని ప్రధానమైన తేడాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తయారీ విధానం :
రెడ్ వైన్ : ఇది ముదురు రంగు ద్రాక్ష రకాల నుంచి తయారవుతుంది. ఉత్పత్తి సమయంలో ద్రాక్షను చూర్ణం చేసి రసం తీస్తారు. ఆపై రసం, తొక్కలు, గింజలు కలిసి పులియబెడతారు. అంటే.. ఇక్కడ చూర్ణం చేసిన ద్రాక్ష విత్తనాలు రసం నుంచి తీసివేయరు. అలా పులియబెట్టినప్పుడు తొక్కలు వైన్‌కు రంగు, టానిన్లు, రుచిని అందిస్తాయంటున్నారు నిపుణులు. అయితే, రెడ్ వైన్ ఎరుపు ద్రాక్ష (పినోట్ నోయిర్, కాబెర్నెట్ సావిగ్నాన్, మాల్బెక్, మొదలైనవి) నుంచి తయారవుతుందని చెబుతున్నారు.
వైట్ వైన్ : ఇది సాధారణంగా ఆకుపచ్చ లేదా పసుపురంగు ద్రాక్ష నుంచి తయారవుతుంది. అయితే, కిణ్వ ప్రక్రియ సమయంలో ద్రాక్ష తొక్కలు రసం నుంచి వేరు చేస్తారు. ఫలితంగా ఆ ద్రావణానికి లేత రంగు వస్తుందంటున్నారు నిపుణులు. అలాగే తక్కువ టానిన్ కంటెంట్ ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే.. వైట్ వైన్ తెల్ల ద్రాక్ష (చార్డొన్నే, సావిగ్నాన్ బ్లాంక్, పినోట్ గ్రిజియో మొదలైనవి) నుంచి తయారవుతుందంటున్నారు.
టేస్ట్ విషయంలో తేడాలు :
రెడ్ వైన్ : రెడ్ వైన్‌లు రుచిలో రకరకాల ఫ్లేవర్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి తరచుగా డార్క్ ఫ్రూట్స్ పండ్లు(బ్లాక్‌బెర్రీ, చెర్రీ వంటివి), సుగంధ ద్రవ్యాలు, కొన్నిసార్లు ఓక్ వంటి వివిధ రుచులను కలిగి ఉంటాయి. అయితే, టానిన్ స్థాయిలను బట్టి వాటి టేస్ట్ మారుతుందంటున్నారు నిపుణులు. ఇకపోతే ఇది వైట్ వైన్ కంటే తక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది.
వైట్ వైన్ : వైట్ వైన్‌లు సాధారణంగా సిట్రస్ (నిమ్మ), స్టోన్ ఫ్రూట్(పీచు, నేరేడు పండు), పైనాపిల్, మెలోన్, పూల లేదా హెర్బల్ వంటి వివిధ రకాల రుచులను కలిగి ఉంటాయి. అయితే, ఇవి తక్కువ టానిన్‌లతో కూడి మరింత ఆమ్లంగా ఉంటాయి.
మందు బాబులకు అలర్ట్ - లివర్ దెబ్బతినొద్దంటే ఆల్కహాల్ ఆ లిమిట్ దాటొద్దంట!
ఉష్ణోగ్రతలు :
రెడ్ వైన్ : దీనిని సాధారణంగా 60-65°F (15-18°C) మధ్య ఉండే గది ఉష్ణోగ్రత వద్ద పులియబెడతారు. ఈ చల్లటి ఉష్ణోగ్రతలు దాని సువాసనలు, రుచులను సంరక్షించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు.
వైట్ వైన్ : దీనిని సాధారణంగా 45-55°F (7-13°C) మధ్య చల్లగా ఉండే వాతావరణంలో పులియబెడతారు. ఈ ఉష్ణోగ్రతలు దాని రుచి, వాసనలను పెంపొందించడంలో ఉపయోగపడతాయంటున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు :
రెడ్ వైన్ : మితమైన రెడ్ వైన్(Red Wine) వినియోగం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో ఉండే రెస్వెరాట్రాల్ వంటి వివిధ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు.. మెరుగైన గుండె ఆరోగ్యం, మెరుగైన మెదడు పనితీరు కోసం తోడ్పడతాయంటున్నారు. అలాగే.. కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు.
2018లో "npj అగింగ్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రెడ్ వైన్ మితంగా తాగేవారు జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరులో మెరుగుదలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ ఎరిన్ మోరిసన్ పాల్గొన్నారు. రెడ్‌వైన్‌ను మితంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే పాలిఫెనోల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు.. జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును మెరుగుపర్చడానికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.
వైట్ వైన్ : దీనిలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ, వైట్ వైన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రెడ్ వైన్ కంటే భిన్నంగా ఉండవచ్చంటున్నారు. మితమైన వైట్ వైన్ వినియోగం.. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.