Reasons for Some Girls Get Early Periods: ఒకప్పుడు ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా రజస్వల వయసు కూడా మారుతూ వస్తోంది. చాలా మంది అమ్మాయిలు పదేళ్లకే మెచ్యూర్ అవుతుండగా.. కొందరు 8 ఏళ్లకే అవుతున్నారు! విదేశాల్లో అయితే ఈ వయసు 7 సంవత్సరాలుగా కూడా నమోదవుతోంది! "యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి" నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో దాదాపు 15 శాతం మంది బాలికలు 8 ఏళ్లకే రజస్వల అవుతున్నారు.
చిన్న వయసులోనే రజస్వల కావడానికి కారణాలు:
హార్మోన్ల మార్పులు: చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడానికి ప్రధాన కారణం హార్మోన్లలో మార్పులు అని నిపుణులు అంటున్నారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు పునరుత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, నియంత్రించడానికి కారణమవుతాయి. ఈ హార్మోన్లు సాధారణంగా 8-14 సంవత్సరాల మధ్య పెరిగి, పీరియడ్స్ స్టార్ట్ కావడానికి కారణమవుతాయి. కానీ.. కొద్ది మంది బాలికలలో ఈ హార్మోన్లు చిన్న వయస్సులోనే పెరగడం ప్రారంభమవుతున్నాయి. ఈ కారణంగానే 8 సంవత్సరాల కంటే ముందు కూడా పీరియడ్స్ వస్తున్నాయని చెబుతున్నారు.
నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడం సాధారణమేనా? - నిపుణుల మాటేంటి!
జన్యువులు: ఎనిమిది సంవత్సరాల వయసులోనే పీరియడ్స్ రావడానికి జన్యువులు కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఒక కుటుంబంలోని మహిళలకు.. అంటే తల్లి, మేనత్త.. ఇలా ఎవరికో ఒకరికి చిన్న వయస్సులోనే పీరియడ్స్ వస్తే.. అదే కుటుంబంలోని ఇతర బాలికలలో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
బరువు పెరగడం: చిన్న వయసులోనే అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు కణజాలం ఉండటం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, ఇవి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణమవుతాయని చెబుతున్నారు. 2013 లో "Pediatrics" జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో 5 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల 3,500 మంది బాలికలను పరీక్షించగా.. అధిక బరువు ఉన్న బాలికలలో 8 సంవత్సరాల కంటే ముందు పీరియడ్స్ రావడానికి 50% ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు.
పీరియడ్స్ సరిగా రావట్లేదా? ఇవి తింటే చాలు - ప్రాబ్లమ్ క్లియర్!
మారిన జీవనశైలి: శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా ఈ సమస్యకు కారణం అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జంక్ ఫుడ్స్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయని, ఇవి రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
పర్యావరణ కారకాలు: పర్యావరణ కారకాలు కూడా చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి ఒక కారణం కావచ్చని అంటున్నారు. ఎందుకంటే.. పురుగుమందులు, ప్లాస్టిక్ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఉండే ఫ్తాలేట్స్, బిస్ఫినాల్ A, ఇతర రసాయనాలు ఈస్ట్రోజెన్ సహా ఇతర హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ఈ కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉందట.
పోషకాహార లోపం: ఐరన్ లేదా విటమిన్ డి లోపం వంటి పోషకాహార లోపాలు కూడా చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు.
ఒత్తిడి: దీర్ఘకాలిక ఒత్తిడి కూడా చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి ఒక కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. దీర్ఘకాలిక ఒత్తిడి హైపోథాలమిక్-పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్‌కు అంతరాయం కలిగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుందని, ఇది యుక్తవయసు సమయాన్ని ప్రభావితం చేసి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణమవుతుందని అంటున్నారు.
చిన్న వయసులో పీరియడ్స్ రావడం వల్ల కలిగే సమస్యలు:
- చిన్న ఏజ్‌లో వచ్చే పీరియడ్స్ అస్థిపంజర పరిపక్వతను వేగవంతం చేస్తుంది. దీని ఫలితంగా ఎత్తు పెరిగే అవకాశం ఉండదు.
- రొమ్ము క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, జీవక్రియకు సంబంధించిన సమస్యలు, వంటి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.
- చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం వల్ల బాలికలలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి.
పీరియడ్స్ కోసం మందులు వాడుతున్నారా? మరిన్ని చిక్కులొస్తాయి - ఇలా సరిచేసుకోండి!
పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!
నెలసరి టైమ్‌లో కడుపు నొప్పా? వికారంగా ఉంటోందా?.. ఈ టిప్స్ మీ కోసమే!