Health Benefits Of Punarnava Leaves : ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మొక్క పేరు "గలిజేరు". పల్లెల్లో పొలం గట్ల వెంట, నేలమీద తీగలా పారుతుంది. వర్షా కాలంలో ఇంటి పరిసరాల్లో కూడా పెరుగుతుంది. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆకు కూరలా వండుకొని తింటారు. ఇందులో.. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని రెండు రకాలు ఉంటాయి. అందులో తెల్ల గలిజేరునే.. పునర్నవ, అటికమామిడి, పప్పాకు అని కూడా అంటారు. ఈ మొక్క ఇంటి వైద్యానికి పెట్టింది పేరు. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయని.. ఈ ఆకుకూర తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ చిలువేరు రవీందర్.
కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం : కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఈ మొక్క ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ ఆకు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి, మెరుగ్గా పనిచేయటానికి కావాల్సిన పోషణనిస్తుందని చెబుతున్నారు. గలిజేరులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మూత్ర ప్రవాహాన్ని పెంచి కిడ్నీలో రాళ్లను యూరిన్ ద్వారా బయటకు పంపడానికి సహాయపడుతాయంటున్నారు. అదేవిధంగా బాడీలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం కూడా దీనికి ఉంటుందని చెబుతున్నారు. అలాగే.. ఇందులో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతాయంటున్నారు.
లివర్ ఆరోగ్యానికి మేలు : పునర్నవ ఆకుకూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. ఇతర మినరల్స్ కూడా ఎక్కువే. దీన్ని తినడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు.
జీర్ణక్రియ మెరుగు : ఈ ఆకుకూరలో పుష్కలంగా ఉండే పోషకాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు డాక్టర్ రవీందర్. దీన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. అలాగే స్థూలకాయన్ని నియంత్రించడానికి ఇందులోని పోషకాలు తోడ్పడతాయని చెబుతున్నారు.
ఎముకలు బలంగా మారుతాయి : ఈ ఆకుకూరలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఫలితంగా దీన్ని తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు, వాపు లక్షణాలను తగ్గించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా పునర్నవ ఆకుల్లో డయాబెటిస్‌ను అదుపుచేసే లక్షణాలు ఉంటాయట. ఇవి బాడీలో ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి దోహదపడుతాయని చెబుతున్నారు.
దీన్ని ఎలా తీసుకోవచ్చంటే?
పోషకాలు పుష్కలంగా ఉండే గలిజేరు ఆకుకూరను కర్రీలా వండుకొని తినొచ్చు. పప్పు కూరలలో వేసుకోవచ్చు. కాషాయం చేసుకొనీ తాగొచ్చు. లేదంటే పునర్నవ ఆకులను పొడి రూపంలో తయారుచేసుకుని గోరువెచ్చని వాటర్‌లో కాస్త కలుపుకొని పానీయంలా సేవించవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయా? - ఇందులో నిజమెంత? - నిపుణుల సమాధానమిదే!