These People Should Not Drink Lemon Water Early Morning: నిమ్మకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకు ఇందులోని పోషకాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొన్ని సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తాగడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరి, వారు ఎవరు? నిమ్మరసం తాగితే వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
నిమ్మరసం ఎవరు తాగకూడదు?: ఎసిడిటీ సమస్య ఉన్నవారు నిమ్మకాయ నీరు అస్సలు తాగకూడదని నిపుణులు అంటున్నారు. అలాగే దంతాల సున్నితత్వం ఉన్న వ్యక్తులు కూడా నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించకూడదని చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు నిమ్మరసాన్ని తక్కువగా తీసుకోవాలంటున్నారు. అంతే కాకుండా నిమ్మకాయను ఎక్కువగా తింటే ఎముకలకు కూడా ప్రమాదకరం అని చెబుతున్నారు.
పైన చెప్పిన సమస్యలు ఉన్న వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కలిగే నష్టాలు:
ఎసిడిటీ ఉన్నవారు: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను తీవ్రతరం చేసి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి(GERD)ని మరింత పెంచుతుందని అంటున్నారు. అందుకే ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు.
దంత సమస్యలున్న వారు: దంత సమస్యలు ఉన్నవారు కూడా నిమ్మరసం తాగే అలవాటును మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో ఉండే యాసిడ్.. దంతాలలో సున్నితత్వాన్ని పెంచుతుందని.. దీని వల్ల దంతాలను రక్షించే ఎనామిల్ కూడా బలహీనపడుతుందని అంటున్నారు.
ఎముక సాంద్రత తక్కువగా ఉన్నవారు: ఈ సమస్య ఉన్నవారు కూడా నిమ్మరసాన్ని పరగడుపున తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కారణం.. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ ఎముకలలోని కాల్షియాన్ని బయటకు పంపి ఎముకల బలహీనమయ్యేలా చేస్తుందని అంటున్నారు.
మూత్రపిండాల సమస్యలున్నవారు: కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదని నిపుణులు అంటున్నారు. 2021లో యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రాళ్లు ఏర్పడతాయని కనుగొన్నారు. నిమ్మరసంలోని ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పాటుకు దోహదపడతాయన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జె. ఆండ్రూ జాయ్ పాల్గొన్నారు.
డయాబెటిస్ ఉన్నవారు: నిమ్మరసం రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని.. ఇది డయాబెటిస్ నిర్వహణను కష్టతరం చేస్తుందని అంటున్నారు. కాబట్టి ఉదయం పూట నిమ్మరసం తాగకూడదని సలహా ఇస్తున్నారు.
పొట్టలో పుండ్లు ఉన్నవారు: నిమ్మరసంలోని ఆమ్లాలు పొట్టలో పుండ్లకు చికాకు కలిగించి, నొప్పిని పెంచుతాయిని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.