Food Guide for Pcos Women : నేటి ఆధునిక కాలంలో ఎంతో మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కాగా, అలాంటి సంతానలేమి సమస్యల్లో పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది మహిళలు ఈ సమస్య వస్తే పిల్లలు పుట్టరని భయపడతారు. కానీ, చక్కటి జీవనశైలిని పాటిస్తూ.. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు.. పీసీఓఎస్ అంటే ఏమిటి? ఈ సమస్యతో బాధపడేవారు ఎలాంటి జీవనశైలి అలవాట్లు, ఆహార నియమాలు పాటించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది క్రమంగా పీసీఓఎస్‌కి దారితీస్తుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు, డాక్టర్ లతాశశి. దీని వల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్ స్వింగ్స్.. వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ నియంత్రణలో ఉండడంతో పాటు పీసీఓఎస్ అదుపులోకి రావాలంటే ముందుగా మీ డైలీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా పీసీఓఎస్ ఉన్నవారు.. రోజూ తీసుకునే ఆహార పరిమాణంతో పాటూ ఆహార వేళలను తప్పనిసరిగా పాటించాలంటున్నారు. అదే విధంగా.. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్ర కూడా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అలాగే ఒత్తిడి లేకుండానూ చూసుకోవాలని చెబుతున్నారు. ఇకపోతే శారీరక వ్యాయామాలు.. కండరాల బలానికి, గుండెకు సంబంధించిన వాటిని ఎంచుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎత్తుకు మించి బరువు ఉంటే మాత్రం తగ్గాలంటున్నారు. అయితే, కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారని చెబుతున్నారు డాక్టర్ లతాశశి.
అలర్ట్ : ఈ అలవాట్లు ఉంటే - మీకు పిల్లలు పుట్టకపోవచ్చు!
ఇకపోతే.. ఇన్సులిన్ హెచ్చు తగ్గులున్నవారు సమయానికి భోజనంతో పాటూ సాయంత్రం స్నాక్స్‌ను కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ లతాశశి. స్నాక్స్ టైమ్‌లో నట్స్ తీసుకున్నా మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటున్నారు. అదేవిధంగా.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే తృణధాన్యాలు, సోయా, పప్పుదినుసులు తీసుకోవడం వల్ల తగినన్ని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు లభిస్తాయని చెబుతున్నారు. కాయగూరలు, పండ్లు రోజూ తినాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-బి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు లతాశశి. ఈ క్రమంలో ఆకుకూరలు, చేపలు, గుడ్లు.. వంటివి తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. తద్వారా పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవడంతో పాటు బరువు కూడా క్రమంగా తగ్గవచ్చని సూచిస్తున్నారు. అలాగే 2017లో 'ఓబెసిటీ సైన్స్ & ప్రాక్టీస్' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పీసీఓఎస్ ఉన్న మహిళలు విటమిన్ బి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గారని, అలాగే పీసీఓఎస్ హార్మోన్ స్థాయిలు కాస్త అదుపులోకి వచ్చాయని కనుగొన్నారు.
వీటికి దూరంగా ఉండాలి : పీసీఓఎస్ ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగుల్ని తీసుకోవాలని.. వంటకాలలో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడ వల్ల పీసీఓఎస్, ఇన్సులిన్ స్థాయులు అదుపులోకి వస్తాయని.. ఆ తర్వాత గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
40 ఏళ్లు దాటితే.. శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా? పిల్లలు పుట్టరా?