Muskmelon Seeds Health Benefits: ఎండలు దంచికొడుతున్నాయి. తొమ్మిది దాటకముందే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు, జ్యూసులు, కూల్‌డ్రింక్స్ వంటి వాటి మీద ఆధారపడతారు. మరికొందరు పండ్ల మీద ఆధారపడుతుంటారు. కాగా పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండే వాటికి ఈ వేసవిలో బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి పండ్లలో కర్బూజ ఒకటి. ఈ పండులో 90శాతానికి పైగా నీరు ఉంటుంది. పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే చాలా మంది కర్బూజ పండును తినగానే అందులో ఉన్న విత్తనాలను పడేస్తుంటారు. ఈ విత్తనాలను పడేసే వారు అనేక ప్రయోజనాలు కోల్పోతున్నట్లే అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఈ గింజలు ఏ ప్రయోజనాలు అందిస్తాయో ఇప్పుడు చూద్దాం..
పోషకాలు చూస్తే: కర్బూజ గింజలలో విటమిన్ సి, ఎ, ఇ, ప్రొటీన్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్, ఫైబర్ వంటి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే కర్బూజ గింజలలో లైకోపిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీర కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రయోజనాలు:
రోగనిరోధక వ్యవస్థ: కర్బూజ గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో అలాగే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కర్బూజ గింజలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు.
జీర్ణక్రియ.. ఫైబర్ అధికంగా ఉండే కర్బూజ గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలు తినడం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. 2016లో ఫుడ్ ఫంక్షన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కర్బూజ గింజల్లోని ఫైబర్.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డా. జాంగ్ యాన్ పాల్గొన్నారు.
అధిక రక్తపోటు: కర్బూజ గింజలలో మెగ్నీషియం అధికంగా ఉంటుందని.. అధిక రక్తపోటును తగ్గించడంలో ఈ గింజలు చక్కగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.
డిప్రెషన్ సమస్య స్త్రీలలోనే ఎక్కువట- ఎందుకంటే? - Women Depression Reasons
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కర్బూజ గింజలలో మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు.
చర్మ ఆరోగ్యం: ఈ గింజల్లోని విటమిన్ ఎ, సి, ఇ లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు అంటున్నారు. వయసు పెరిగే కొద్దీ బాడీలో తగ్గే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఈ విత్తనాలు సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే చర్మంపై ముడతలు రాకుండా చూస్తుందని, వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో ఈ గింజలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కర్బూజ గింజలలో ప్రొటీన్, జింక్ కూడా అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని సూచిస్తున్నారు.