Pregnancy Test Negative But No Period: మహిళల్లో చాలా మంది పిరియడ్స్ మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అయితే, ఈ క్రమంలో గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్ ఫలితమే వస్తుంటుంది. ఫలితంగా అటు పిరియడ్స్ రాక.. ఇటు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావడం వల్ల చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. అయితే, గర్భం ధరించామా? లేదా? అన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలంటే నెలసరి మిస్సయిన వారం రోజుల తర్వాత టెస్ట్ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఫలితంగా కచ్చితమైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువని వివరించారు. కానీ కొందరిలో ఆ తర్వాత కూడా నెగిటివ్ వస్తుందని.. అలాంటి వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ కారణాల వల్ల కొంతమందిలో పిరియడ్స్ ఆలస్యంగా వస్తాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యా రంగారావు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, థైరాయిడ్ సమస్యలతో నెలసరి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, ఈ సమయంలో కొందరికి ప్రగ్నెన్సీ టెస్ట్ చేసినా నెగిటివ్ వస్తుందని.. దీనికి కారణం కొన్ని సార్లు అండం గర్భంలో కాకుండా నాళాల్లో ఉండడమేనన్నారు. ఫలితంగా అప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆలస్యంగా, చాలా తక్కువగా చూపిస్తుందని వివరించారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంకా కొన్ని లక్షణాల ద్వారా కూడా గర్భం ధరించామన్న విషయం తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- వక్షోజాలు నొప్పిగా అనిపించడం, పరిమాణం పెరగడం
- అలసట, నీరసం, వాంతులు, వికారం, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనిపించకపోవడం
- తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం
- హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంతమందిలో కడుపునొప్పి, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు
- ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటివి కొంతమందిలో కనిపించచ్చు
- కొంతమందిలో అరుదుగా స్పాటింగ్ కూడా కనిపించచ్చని చెబుతున్నారు. గర్భం ధరించాక 10 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాన్ని గుర్తించచ్చని అంటున్నారు.
ఒకవేళ స్వీయ గర్భధారణ పరీక్షలో నెగెటివ్ అని తేలినా.. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. వైద్యుల వద్ద గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోని.. తద్వారా తొలినాళ్లలోనే ప్రెగ్నెన్సీని గుర్తించడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా తల్లీబిడ్డలిద్దరికీ పలు ప్రయోజనాలు చేకూరతాయని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రి సరిగ్గా నిద్ర పట్టట్లేదా? ఈ చిన్న పని చేస్తే హాయిగా నిద్రపోతారట! మీరు ట్రై చేయండి
ప్రతి రోజు భోజనంలో పెరుగు తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!