New Type Of Blood Test : పిల్లల్లో భవిష్యత్‌లో మధుమేహం వచ్చే అవకాశం ఉందా అనే అంశాన్ని గుర్తించే ఒక కొత్త రక్తపరీక్షను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇకపై ఈ పరీక్ష ద్వారా హృద్రోగం, కాలేయ వ్యాధి వంటి ఊబకాయ సంబంధ రుగ్మతలకు ముందస్తు హెచ్చరికలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్నారుల రక్తంలోని ప్లాస్మాను పరీక్షించడానికి ఇప్పటికే పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో పిల్లల్లో మధుమేహానికి సంబంధించిన ఆరంభ సంకేతాలను గుర్తించొచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే, దశాబ్దాలుగా లిపిడ్లను శరీరంలో ఫ్యాటీ ఆమ్లాలుగా శాస్త్రవేత్తలు భావిస్తూ వస్తున్నారు. వీటిని మంచి, చెడు కొలెస్ట్రాల్‌గా వర్గీకరించేవారు. లిపిడ్లపై లోతుగా పరిశీలించిన శాస్త్రవేత్తలు వీటి తీరుతెన్నులు మరింత సంక్లిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. మాస్ స్పెక్ట్రోమెట్రీ విధానంతో విశ్లేషించినప్పుడు శరీరంలో వేల రకాల లిపిడ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒక్కోదానికి ఒక్కో పాత్ర ఉన్నట్లు తేల్చారు. వాటిని విస్తృతంగా విశ్లేషించి, ఊబకాయ సంబంధ వ్యాధుల ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించొచ్చని తెలిపారు.
Our study is out today to do with children with obesity & cardio metabolic risk
— Cristina Legido-Quigley (@DrLegidoQuigley) September 20, 2024
Press release “New blood test could be an early warning for child diabetes | King's College London https://t.co/JkfTe7YiyM
''ఈ పరిశోధన భవిష్యత్తులో ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా వచ్చే వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగ పడుతుంది. శరీరంలోని లిపిడ్ అణువులు ఎలా మారుతాయో అధ్యాయనం చేయడం ద్వారా మధుమేహం, ఊబకాయా వ్యాధులను గుర్తించి పూర్తిగా నిరోధించవచ్చు.'' అని డాక్టర్ క్రిస్టినా లెగిడో-క్విగ్లీ తెలిపారు.
1,300 మంది పిల్లలపై పరిశోధన : ఈ పరిశోధనలో భాగంగా, ఊబకాయం ఉన్న సుమారు 1,300 మంది పిల్లలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారి రక్తంలోని లిపిడ్లను నిశితంగా విశ్లేషించారు. వారిలో 200 మందిని ఏడాది పాటు 'హోల్‌బేక్ మోడల్' అనే జీవనశైలిలో ఉంచారు. ఊబకాయానికి చికిత్స అందించడం కోసం డెన్మార్క్‌లో దీన్ని ఎక్కువగా సూచిస్తుంటారు. అనంతరం ఈ చిన్నారులను పరిశీలించినప్పుడు, వారిలో మధుమేహపు ముప్పు, ఇన్సులిన్ నిరోధకతతో పాటుగా, అధిక రక్తపోటుతో ముడిపడిన లిపిడ్ల సంఖ్య తగ్గిపోయినట్లు గుర్తించారు. వీరి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ) పరంగా కొద్దిపాటి మెరుగుదలే కనిపించినప్పటికీ ఈ ఫలితం సాధ్యమైందని పరిశోధకులు తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.