Signs to Tell Liver is Not Healthy : లివర్ ఆరోగ్యంగా లేకపోతే.. మొదటగా జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయంటున్నారు నిపుణులు. అయితే.. సాధారణంగా జీర్ణ సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ, తరచుగా జీర్ణ సమస్యలు వేధిస్తుంటే మాత్రం అది కాలేయానికి సంబంధించిన తీవ్రమైన సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.
విపరీతమైన అలసట : మీ బాడీలో లివర్ డ్యామేజ్ అవుతున్నట్లయితే కనిపించే మరో లక్షణం.. విపరీతమైన అలసట. తరచుగా ఏ చిన్న పని చేసినా అలసటకు గురవుతుంటే మాత్రం వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు.
ఆకలి లేకపోవడం : మీరు లివర్ సమస్యతో బాధపడుతున్నట్లయితే కనిపించే మరో లక్షణం.. ఆకలి మందగించడం. అయితే.. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, మీకు చాలా రోజులుగా ఏమి తినాలనిపించకపోయినా లేదా ఆకలి వేయకపోయినా అది లివర్ డ్యామేజ్‌కు సంబంధించిన సంకేతంగా అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
కామెర్లు : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు కళ్లు, చర్మం పచ్చగా మారడాన్ని గమనించవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. అంటే.. కామెర్లు రావడం కూడా లివర్ ప్రాబ్లమ్‌ను సూచిస్తుందంటున్నారు. కాబట్టి మీలో కూడా ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ కావడం మంచిది అంటున్నారు నిపుణులు.
వికారం : తరచూ వికారంగా ఉండటం, వాంతులు వస్తుండటం వంటి లక్షణాలు మీలో కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ లక్షణాలు లివర్ ప్రాబ్లమ్‌ను సూచిస్తాయంటున్నారు. అలాగే చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వికారంగా ఉండటం లేదా వాంతులవడం లాంటివి జరుగుతుంటాయి. ఇది కూడా కాలేయ సమస్యకు సంకేతమని చెబుతున్నారు నిపుణులు.
మూత్రం రంగులో మార్పు : మీ కాలేయం బాగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మీ మూత్రం రంగు మరొక మార్గంగా చెప్పుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా యూరిన్ నార్మల్ కలర్లో కాకుండా పచ్చగా లేదా మరే ఇతర రంగులో వస్తున్నా సందేహించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది లివర్‌లో సమస్య ఉందని తెలిపే సంకేతం కావొచ్చంటున్నారు.
మద్యపానం కాకుండా కాలేయం దెబ్బతినడానికి కారణాలేంటి? లివర్ పాడైతే ఏం జరుగుతుంది?
మలబద్ధకం : ఇది కూడా కాలేయ సమస్యను సూచించే మరో ముఖ్యమైన లక్షణంగా సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే లివర్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే జీర్ణక్రియపై ప్రభావం పడి అది మలబద్ధకానికి దారి తీస్తుందంటున్నారు.
2017లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఉన్న వ్యక్తులలో మలబద్ధకం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని యాంగ్జౌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. యున్-జియాన్ జాంగ్ పాల్గొన్నారు. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో జీర్ణసమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
చర్మ సమస్యలు : మీరు చర్మంపై దురద ఒక్కటే దద్దుర్లు వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటే అది కూడా లివర్ సమస్యకు సంకేతమని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇవేకాకుండా లివర్‌లో సమస్య ఏర్పడినప్పుడు.. కడుపు నొప్పి, తరచుగా జ్వరం, ఏకాగ్రత లోపించడం, అతిసారం, చెడు శ్వాస వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.