Liposuction Surgery Dos And Donts : ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా బరువు పెరగడం వల్ల చిన్న వయసులోనే శరీరాకృతిని కోల్పోయి చాలామంది యువతీయువకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసమే అత్యాధునికమైన లైపోసక్షన్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చారు వైద్యరంగ నిపుణులు. ఈ సర్జరీతో శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించడమే కాకుండా మీ శరీరాకృతిని నాజుగ్గా మార్చుకోవచ్చు.
లైపోసక్షన్ సర్జరీ అంటే ఏంటి, ఎందుకు, ఎలా చేస్తారు?
What Is Liposuction Surgery : లైపోసక్షన్ ఆపరేషన్ లేదా లైపో సర్జరీ అనేది శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును కరిగించి మన శరీరాకృతిని నాజుగ్గా మార్చే అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీ విధానం. మన శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాల్లోకి కార్నిలా అనే ఖాళీ పైపును పంపి కొవ్వును ద్రవరూపంలో బయటకు తీస్తారు. ఈ పద్ధతిని మొట్టమొదటి సారిగా 1985లో ఫ్రాన్స్‌లో ప్రయోగించి సత్ఫలితాలు సాధించారు వైద్యులు. అయితే లైపోసక్షన్ సర్జరీ అనేది చాలామంది బరువు తగ్గించుకోవడానికి చేసే సర్జరీ అని అనుకుంటారు. కానీ, అది పూర్తిగా అవాస్తవమని, కేవలం మన శరీరానికి సరైన ఆకృతి వచ్చేలా చేయించుకునే ట్రీట్మెంటే ఈ లైపోసక్షన్ సర్జరీ అని చెబుతున్నారు డాక్టర్లు.
లైపోసక్షన్ సర్జరీ సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అధికంగా ఉన్న వారికి మాత్రమే ఈ లైపోసక్షన్ సర్జరీని సూచిస్తారు వైద్యులు.
- పొట్ట, పిరుదుల పైభాగం, తొడల ముందుభాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగాలలో అధిక కొవ్వు పేరుకపోయిన వారికి ఈ లైపోసక్షన్ సర్జరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఐదు లీటర్ల కంటే ఎక్కువ ఉన్న సందర్భాల్లో దానిని తొలగించాల్సి వస్తే పేషెంట్‌కు పూర్తిగా మత్తుమందు ఇస్తారు.
- లైపోలో పేషెంట్‌కు ఒకవైపు హైబీప్లూయిడ్స్ ఎక్కిస్తూ మరోవైపు లైపో ప్రక్రియను కొనసాగిస్తారు.
- శరీరంలోని అధిక కొవ్వును కరిగించడానికి కార్నిలా అని పిలిచే ఒక ఖాళీ పైపును వినియోగిస్తారు. కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే ఒక ఆస్పిరేటర్ సాయంతో శరీరంలోని కొవ్వును బయిటకి తీస్తారు.
లైపో సర్జరీ చేయించుకోవాలని అనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సిగరెట్ అలవాటు ఉన్నవారు సర్జరీకి కనీసం రెండు వారాల ముందు నుంచే పొగాకుకు దూరంగా ఉండాలి.
- శరీరంలో ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలి.
- రక్తాన్ని పలుచన చేసే మందులు వాడకుండా జాగ్రత్త పడాలి.
- గతంలో జరిగిన సర్జరీలు, హైబీపీ, మధుమేహం వివరాలు తప్పనిసరిగా లైపో ట్రీట్మెంట్కు ముందు డాక్టర్‌కు వివరించాలి.
సర్జరీ తర్వాత పాటించాల్సిన సూచనలు
- లైపోసక్షన్ సర్జరీ అయిన తరువాత శరీరం వదులుగా మారుతుంది. కనుక 6 నుంచి 8 వారాల వరకు బిగుతుగా ఉండే ఎలాస్టిక్ దుస్తులును మాత్రమే ధరించాలి.
- సర్జరీ పూర్తైన తరువాత శరీరానికి కొంత ఇబ్బందిగా మారుతుంది. వీటి నుంచి బయటపడటానికి పెయిన్ కిల్లర్స్ మందులు ఇస్తారు. వైద్యుల సూచనల మేరకు వాటిని క్రమం తప్పకుండా వాడాలి.
- లైపో సర్జరీ ఫలితాలు పొందడానికి 1 నెల నుంచి 6 నెలల సమయం పడుతుంది.
చివరగా లైపోసక్షన్ ఆపరేషన్ ఫలితాలు దీర్ఘకాలంగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెరిగే వయసు, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, గర్భధారణ తదితర కారణాలతో దీని ఫలితాలపై కొంత ప్రభావం పడవచ్చు.
ముఖ్యగమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకే మేము ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">