Best Tips To Avoid Dry Lips : పెదాలు పొడిబారడం, నల్లగా మారడం, లిప్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ తలెత్తడానికి.. మనం పాటించే అనారోగ్యకర లైఫ్‌స్టైల్‌తోపాటు మరికొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు. కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం.. కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం.. అతినీలలోహిత కిరణాల ప్రభావం, మెలనిన్ ఉత్పత్తి అధికమవడం వంటి అంశాలు పెదాల అనారోగ్యానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవేకాదు.. డీహైడ్రేషన్ కారణంగా కూడా.. పొడి పెదాల సమస్య తలెత్తుతుందంటున్నారు. అదేవిధంగా నోటితో శ్వాస తీసుకోవడం, పెదాలను హైడ్రేట్‌గా ఉంచడానికి వాడే లిప్ బామ్స్, లిప్ స్టిక్‌లూ.. డ్రై లిప్స్కి కారణం కావొచ్చంటున్నారు. కాబట్టి, ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డ్రై లిప్స్ సమస్య రాకుండా చూసుకోవచ్చంటున్నారు.
పెదాలు పొడిబారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
- పెదాలు పొడిబారే సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముందుగా బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అందుకోసం డైలీ తగినంత వాటర్ తాగేలా చూసుకోవాలని చెబుతున్నారు.
- రోజూ బయటికి వెళ్లే ముందు పెదాలకు SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిప్‌బామ్‌ను రాసుకోవాలి. తద్వారా అతినీల లోహిత కిరణాల ప్రభావం అధరాలపై పడకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే, లిప్ బామ్స్ కెమికల్ రహితమైనవి ఎంచుకోవాలి. అలాగే పెదాలకు అడ్డుగా మాస్క్ ధరించడం లేదా స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు.
- కొంతమందికి పదే పదే పెదాలను నాలుకతో అద్దుతూ, పంటితో కొరికే అలవాటు ఉంటుంది. దీనివల్ల కూడా పెదాలు పొడిబారి రంగు మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఈ అలవాటును పూర్తిగా మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
- పెదాలను మృదువుగా ఉంచడానికి కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ రాత్రిపూట కాస్త కలబంద(Aloe vera) గుజ్జును పెదాలపై అప్లై చేసి కాసేపు మర్దనా చేసుకుంటే సరిపోతుంది. తద్వారా పెదాలకు కావాల్సినంత తేమ అంది సున్నితంగా మారతాయంటున్నారు.
- 2018లో "Journal of Dermatological Science" జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎండ వల్ల పొడిబారిన పెదాలను మృదువుగా మార్చడంలో కలబంద గుజ్జు చాలా బాగా పనిచేస్తుందని గుర్తించారు. ఈ పరిశోధనలో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మన్స్టర్కు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఉవే ఆర్. గీలర్ పాల్గొన్నారు. అలోవెరాలోని ఔషధ గుణాలు లిప్స్‌ను మృదువుగా ఉంచడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
- లేదంటే.. రాత్రి పడుకునే ముందు పెదాలకు ఆలివ్ ఆయిల్ రాసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇది పొడిబారిపోయి పాలిపోయిన పెదాలకు తేమనందిస్తుందని, తద్వారా లిప్స్ మృదువుగా మారడంతో పాటు మంచి రంగులోకి వస్తాయని చెబుతున్నారు.
- సహజసిద్ధమైనవి కాకుండా బయటి నుంచి ఎలాంటి క్రీమ్స్, లిప్‌బామ్/లిప్ జెల్.. వంటివి వాడాలనుకున్నా.. ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సిగరెట్‌తో లిప్స్ నల్లగా మారాయా? ఈ టిప్స్‌తో ఈజీగా తెల్లగా మార్చేయండి!