Leg Pain A Warning Sign Of Heart Problems : గుండెపోటు సంకేతాలు అంటే.. ఛాతి నొప్పి, ఎడమ చేతి నొప్పి, భుజం నొప్పి, దవడ నొప్పులు వేధిస్తాయని చాలా మందికి తెలుసు. కానీ.. గుండెపోటు నొప్పి కాళ్లలో కూడా మొదలవుతుందని మీకు తెలుసా? కాళ్లలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నవారు వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. కాలునొప్పికి, గుండె జబ్బులకు మధ్య సంబంధమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాళ్లలో అప్పుడప్పుడు నొప్పులు రావడం సహజమే. కానీ, అలాకాకుండా దీర్ఘకాలికంగా కాలు నొప్పి వేధిస్తుంటే మాత్రం అది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD) వల్ల కావొచ్చంటున్నారు నిపుణులు. PAD అనేది.. ఒక దీర్ఘకాలిక వ్యాధి. మన బాడీలోని ఇతర భాగాల్లో మాదిరిగా కాళ్లు లేదా చేతులలోని ధమనులలో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో చేరడం కారణంగా అవి మూసుకుపోతాయి. దాంతో ఆ ప్రాంతంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అలాగే ఆ ప్రాంతాల్లోని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లడం కష్టతరంగా మారుతుందంటున్నారు నిపుణులు.
అంతేకాదు, PAD అనేది.. కరోనరీ ఆర్టరీ డిసీజ్(CAD) ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా.. కరోనరీ ఆర్టరీలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. PADని CAD ప్రారంభ హెచ్చరిక సంకేతంగా చెప్పుకోవచ్చంటున్నారు. కాబట్టి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌ను ఏమాత్రం చిన్నచూపు చూడకుండా ముందస్తు సంకేతాలతో దీనిని గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ 5 రకాల బాడీ పెయిన్స్లో ఏది కనిపించినా అలర్ట్ కావాల్సిందే - గుండెపోటు సంకేతం కావొచ్చట!
2017లో 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. PAD ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తులకు గుండెపోటు రావడానికి రెండు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో గ్రీస్‌లోని ఏథెన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.పి. థానసౌలిస్ పాల్గొన్నారు. దీర్ఘకాలిక కాలు నొప్పి(PAD) గుండె జబ్బులకి దారితీసే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది నిజమేనా?
PADలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే?
- కాళ్లకు రక్తప్రసరణ లోపం
- కాలు వెంట్రుకలు రాలడం
- కాళ్లపై చర్మం రంగు మారడం
- లెగ్స్‌లో తిమ్మిరి, నొప్పులు, చల్లగా అనిపించడం
- కాళ్లు లేదా పాదాలలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం
- కాలి, పాదాలపై నయం కాని గాయాలు
- విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీ పాదాలు, కాలి వేళ్లలో మంట లేదా నొప్పి
PADని ఎలా నిర్ధారించాలంటే?
కాలు నొప్పికి కారణమయ్యే గుండె ఆరోగ్య పరిస్థితులను కొన్ని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. యాంకిల్-బ్రాచియల్ ఇండెక్స్ లేదా ABI మెజర్మెంట్స్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు చేతులు, కాళ్లలో రక్తపోటును అంచనా వేస్తాయి. అలాగే.. డాప్లర్ అల్ట్రాసౌండ్, CT యాంజియోగ్రఫీ, MRA స్కానింగ్ వంటి వైద్య పరీక్షల ద్వారా PAD ప్రాబ్లమ్ ఉందో లేదో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఒకవేళ PAD ఉన్నట్లు తేలితే.. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం, కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, పొగాకుకి దూరంగా ఉండడం, నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. తద్వారా ఈ సమస్య నుంచి కొంతమేర ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.