Is Any Relation Between Menopause and Constipation: ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా... ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి కారణాలు అంటే బోలెడు ఉన్నాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, తగినన్ని నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అసలే తినకపోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి మాత్రమే కాకుండా మెనోపాజ్ దశలో ఉన్నవారికి కూడా మలబద్ధకం సమస్య ఉంటుందా? అంటే నిజమే అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెనోపాజ్ దశలో మలబద్ధకం సమస్య కనిపించడం సాధారణమని పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల అంటే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ల హెచ్చు తగ్గుల వల్ల జీర్ణ ప్రక్రియ వేగం మందగిస్తుందని.. దీనికి తోడు ఆడవారిలో వయసు పెరిగే కొద్దీ పెల్విక్ కోర్ మజిల్స్ బలహీనమవుతాయని అంటున్నారు. అలానే, కొన్నిరకాల మందులు అంటే థైరాయిడ్, బీపీ, ఐరన్ మాత్రలతో పాటు యాంటీ డిప్రెసెంట్స్ వల్ల కూడా ఇలా కావొచ్చని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు పరిశోధనలు సైతం చెబుతున్నాయి.
2002లో మెనోపాజ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మెనోపాజ్ తర్వాత మహిళల్లో మలబద్ధక సమస్య 29% అధికం అని కనుగొన్నారు. ఈస్ట్రోజెన్ స్థాయిలలో తగ్గుదల మలబద్ధకానికి ప్రధాన కారణమని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ షాంఘైలో అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ డాక్టర్ జున్‌లాంగ్ జాంగ్ పాల్గొన్నారు.
మెనోపాజ్‌లో మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని వ్యాయామాల ద్వారా అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి చెబుతున్నారు. అధిక పీచు ఉండే పదార్థాలు తీసుకోవడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. అంటే.. చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పాలిష్ పట్టని గోధుమలు, మొక్కజొన్నల నుంచి వచ్చిన పిండి, క్వినోవా, రవ్వలతో చేసినవన్నీ తీసుకోవాలని అంటున్నారు.
పప్పులు: బొబ్బర్లు, శనగలు, పెసర్లు వంటివి తరచూ తినాలని అంటున్నారు. అంతేకాకుండా కాలానుగుణంగా స్థానికంగా దొరికే పండ్లు తినాలని.. బత్తాయి, జామ, బొప్పాయి.. వంటివాటిల్లోనూ అధిక మోతాదులో పీచు లభిస్తుందని.. వీటిని తినడం వల్ల కూడా సమస్య తగ్గుతుందని అంటున్నారు.
కూరగాయలు: పచ్చిగా తినగలిగే కీరా, క్యారెట్, టమాటలు, కూర రూపంలో అయితే చిక్కుళ్లు, గోరు చిక్కుళ్లు, దోసకాయ, బెండకాయ వంటివాటినీ డైట్‌లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. అలాగే రోజూ ఐదు నానబెట్టిన బాదం, టీ స్పూన్ అవిసెలు, గుమ్మడి గింజలు వంటి నట్స్ తీసుకుంటే... ఇవన్నీ మలాన్ని సాఫీగా వెళ్లేలా చేస్తాయని..నానబెట్టిన మెంతులు తిన్నా సాల్యబుల్ ఫైబర్ దొరుకుతుందని అంటున్నారు.
వ్యాయామాలు: వీటితో పాటు తప్పనిసరిగా రోజూ అరగంటైనా వ్యాయామాలు చేయాలని.. వాకింగ్, రన్నింగ్,స్విమ్మింగ్, సైక్లింగ్ ఏదైనా మంచిదే అంటున్నారు. అలానే పెల్విక్ ఫ్లోర్ వర్కవుట్స్ కూడా ట్రై చేయమంటున్నారు. ఇవి బ్లాడర్, జీర్ణాశయ పనితీరుని మెరుగుపరుస్తాయని.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని అంటున్నారు.
ఇవి తినకూడదు: తినేవాటికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో.. తినకూడనివాటి జోలికి పోకుండా ఉండటమూ అంతే ముఖ్యమని డాక్టర్ లతాశశి అన్నారు. ప్రధానంగా బేకరీ ఐటెమ్స్, మైదాతో చేసిన స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివాటికి దూరంగా ఉండాలని అంటున్నారు. అప్పుడే జీర్ణాశయ కదలికలు మెరుగ్గా ఉంటాయని.. మలబద్ధకం అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.