Yoga History And Benefits In Telugu : ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలోనే యోగా కూడా పుట్టింది. యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. మన ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పురుడుపోసుకున్న యోగా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది.
లోపించిన శారీరక శ్రమ- పెరిగిన మానసిక సమస్యలు
ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి డబ్బు సంపాదించే యంత్రం లాగా మారాడు. తనను తాను మర్చిపోయి టార్గెట్లు, లక్ష్యాలంటూ పరుగులు పెడుతున్నాడు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ 24/7 కష్టపడుతున్నారు కానీ తమకంటూ ఓ గంట సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మనిషి శారీరక శ్రమకు దూరమయ్యాడు. మానసికంగా బలహీనుడయ్యాడు.
ఆరోగ్యంపై శ్రద్ధ
ఇటీవల ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అందుకే ఇప్పుడు రకరకాల ఆరోగ్య డైట్‌లు పుట్టుకొస్తున్నాయి. వీలైనంత వరకు అందరూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. జిమ్‌ల బాట పడుతున్నారు. కానీ వీటన్నింటికంటే యోగా అత్యంత మేలైనదని పలు అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి.
ఫిట్‌నెస్‌పై అవగాహన అవసరం
ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది యోగా. యోగాకు ఇప్పుడు అంతటి ఆదరణ లభిస్తోంది. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేరవు. యోగాతో ఎలాంటి మానసిక రుగ్మతలైనా పారిపోతాయి. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనల్లో తేలింది. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టరు సూచించే ప్రథమ ఔషధం యోగా. యోగా సాధనతో ఆరోగ్యం, సంపూర్ణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. యోగాతో సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు.
యోగాతో ప్రయోజనాలు
- ఇతర వ్యాయామాలతో లేని గొప్ప ప్రయోజనాలు యోగాతో ఉంటాయి.
- సాధారణ శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు యోగాతో ఉండడం వల్లనే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితమవుతోంది.
- యోగాతో శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం నుండి విషతుల్యాలు (టాక్సిన్స్) వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
- ఆరోగ్యం మాత్రమే కాదు అందమైన ఆకృతికి కూడా యోగా వలన వస్తుంది.
- ఎవరైనా సులభంగా చేయగలిగే 'ధ్యానం' యోగాలో ప్రధానం.
- శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది.
- యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు.
- యోగా సాధన అంటే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు.
- యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని వంచడమే కాదు. మనసు, శరీరాల సంయోగంతో శ్రద్ధగా యోగా చేస్తే యోగా వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
- క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ప్రత్యేకించి ఈ యోగా డే రోజు ఇప్పటివరకు యోగా మొదలు పెట్టని వారు యోగాను మొదలు పెట్టండి. ఇప్పటికే యోగా సాధనలో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను యోగా సాధనలో భాగం చేయండి. యోగా చేద్దాం. ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ ను సాధిద్దాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా? మందులకు బదులు ఈ యోగాసనాలు ట్రై చేయండి! - Yoga For Constipation