Immunity Boost Drinks to Avoid Health Problems During Monsoon: వర్షాకాలంలో.. జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి వర్షాకాలంలో ఈ డ్రింక్స్ తాగమని సలహా ఇస్తున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
గ్రీన్ టీ: రోగనిరోధక శక్తిని పెంచడం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు గ్రీన్ టీ ప్రసిద్ధి చెందింది. ఇది యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అదే కాకుండా గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఆమ్లా జ్యూస్: ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలిచే ఆమ్లా (ఉసిరి) లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆమ్లా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం.. రోగనిరోధక శక్తి బలోపేతానికే కాకుండా.. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
2020లో "ఫుడ్ ఫంక్షన్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఉసిరి రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జియాన్ షు పాల్గొన్నారు. రోజూ ఉసిరిని తీసుకోవడం ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
పసుపు పాలు: పసుపులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. పసుపు పాలకు చిటికెడు నల్ల మిరియాలు జోడించడం వల్ల దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయని అంటున్నారు.
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలు వస్తాయా? - నిపుణులు ఏమంటున్నారంటే?
అల్లం, నిమ్మ, తేనె టీ: అల్లం, నిమ్మ, తేనె.. వీటిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. అలాగే వర్షాకాలంలో జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడుతాయని అంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా గొంతు నొప్పి, అనేక శ్వాస సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగపడతాయని అంటున్నారు.
క్యారెట్ జ్యూస్: క్యారెట్లో విటమిన్లతో పాటు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే చర్మం, కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతాయని పేర్కొన్నారు.
నిమ్మరసం: నిమ్మరసం విటమిన్ సికి అద్భుతమైన మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.
బీట్‌రూట్ జ్యూస్: బీట్రూట్లు ఐరన్, పొటాషియం, ఫోలేట్‌కు మంచి మూలం. ఇవి రక్తహీనతను నివారించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో సహాయపడుతాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం! ఫుల్ లిస్ట్ ఇదే!
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు!