How to Overcome Overthinking Problem: ఈ భూమ్మీద ఆలోచన లేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే.. మరీ అతిగా ఆలోచిస్తేనే ప్రాబ్లం.. ఆలోచన ఆందోళనగా మారితే డేంజర్. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరి.. ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలో ఈ స్టోరీలో చూద్దాం.
అతిగా ఆలోచిస్తే ఏమవుతుంది?: ఏదైనా ఒక విషయంపై అతిగా ఆలోచించడం అంటే అది మనకు ముఖ్యమైనది లేదా మన జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది అయి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమైన విషయంపై ఇలా ఆలోచించడం సాధారణమే. కానీ.. ప్రతి విషయంపైనా ఇలా అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే జీవితంలో దేన్ని కూడా ఆస్వాదించ లేని స్థితికి చేరుకుంటారు. ఓవర్ థింకింగ్ వల్ల నిరాశ, నిస్పృహ కలుగుతుంది. శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. దీనివల్ల అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలంటే..
ధ్యానం: మానసిక సమస్యలను ధ్యానం చక్కగా నివారిస్తుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల ఎక్కువగా ఆలోచించే తీరుకు బ్రేక్ వేయవచ్చు. అలాగే మిమ్మల్ని వేధిస్తున్న ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వచ్చు. అలానే మీరు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలుసుకోవడం సహాయపడుతుంది. ఇంకా అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మెచ్చుకోలుగా ఉండండి. ఇది మీ జీవితంలోని మంచి అంశాలను ప్రతిబింబించేలా చేస్తుంది. ధ్యానం ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుందని, మనసును శాంతపరచడానికి ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది.
వివాదాల పరిష్కారంపై దృష్టి: సమస్య గురించి ఆలోచించి ఇబ్బందులు పడేకంటే.. వాటిని పరిష్కరించే విధానంపై దృష్టి పెట్టండి. ఇంకోసారి వాటి గురించి ఇబ్బందులు పడకుండా ఏం చేయాలా అని ఆలోచించి దానికి శాశ్వత పరిష్కారం ఆలోచించండి.
స్వీయ సంరక్షణ: మీ గురించి, మీ సంరక్షణ గురించి ఆలోచనలు చేయండి. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి.. మీ శ్రేయస్సును మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి కార్యకలాపాలలో పాల్గొనాలి అనే వాటిపై దృష్టి పెట్టండి. మీకు రెస్ట్ అవసరం అయితే విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. క్రమబద్ధమైన వ్యాయామం చేయండి. మీకు సంతోషం, సంతృప్తిని కలిగించే సాధనలను అభ్యాసం చేయండి.
టైమ్ స్పెండ్ చేయడం: తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలవకుండా ఒంటరిగా గడపడం వల్ల కూడా అతి ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు నలుగురితో కలవడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం వల్ల అతి ఆలోచనలు ఇబ్బంది పెట్టవు. సంతోషంగా సమయాన్ని గడపగలుగుతారు.
అనవసర సంగతులు: కొంతమంది భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. చేతిలో ఉన్న వర్తమానాన్ని వదిలేసి.. రేపు ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్తు గురించి రకరకాలుగా ఊహిస్తారు. భయపడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. సంబంధంలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడమంటే తమ విలువైన సమయాన్ని వృథా చేయడమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నిపుణుల సహాయాన్ని: పైన చెప్పిన సలహాలు పాటించినా కూడా మీలో మార్పు అనేది రాకపోతే చివరిగా కౌన్సెలర్ లేదా థెరపిస్ట్ను సంప్రదించండి. మీరు ఏ స్థాయిలో అతిగా ఆలోచిస్తున్నారో తెలుసుకుని దానికి తగిన సలహాలు అందిస్తారు.