How to Remove Pesticide residues On Fruits : పూత నుంచి మొదలు పిందె, కాయ వరకు పలు దశల్లో.. పండ్ల చెట్లపై పురుగు మందులు చల్లుతుంటారు. ఆ తర్వాత పూర్తిగా పక్వానికి రాకముందే కాయలు తెంచి.. కృత్రిమ పద్ధతుల్లో వాటిని పండిస్తుంటారు. అనంతరం మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఇలా.. వివిధ దశల్లో రసాయనాలను వినియోగిస్తుండడం వల్ల చాలా పండ్లపై.. పురుగు మందుల అవశేషాలు స్థాయికి మించి ఉండే అవకాశం ఉంది.
ఇలాంటి పండ్లను సాధారణ పద్ధతిలో ఒకసారి నీటితో శుభ్రం చేస్తే రసాయనాలు తొలగిపోయే అవకాశం తక్కువ. అందుకే.. వాటికి కాస్త సమయం వెచ్చించి మరీ శుభ్రం చేసుకొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. ఆరోగ్యానికి బదులు అనారోగ్యం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎండా కాలం వచ్చిందంటే.. పుచ్చకాయల నుంచి మామిడి వరకు ఎన్నో పండ్లను జనం తింటూ ఉంటారు. అయితే.. కంటికి కనిపించే ప్రతిదీ నిజం కానట్టు.. నిగ నిగలాడుతున్న పండ్లన్నీ తాజావి కాకపోవచ్చని చెబుతున్నారు. వాటిని ఎలాంటి రసాయనాలు వినియోగించి పక్వానికి వచ్చేలా చేశారో తెలియదు కాబట్టి.. సరైన పద్ధతిలో క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నీటిలో నానబెట్టాలి : చాలా మంది మార్కెట్ నుంచి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లగానే తినేస్తుంటారు. ఈ క్రమంలో ఏదో నామమాత్రంగా నీళ్లతో కడుగుతారు. కానీ.. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉన్న కెమికల్స్ పూర్తిగా తొలగిపోవని చెబుతున్నారు. కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే పండ్లపై ఉన్న అవశేషాలు తొలగిపోవని చెబుతున్నారు.
జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా? - పాలకూరను ఇలా వాడారంటే రిజల్ట్ పక్కా!
బేకింగ్ సోడా : పండ్లపై ఉన్న రసాయనాలు తొలగించడానికి బేకింగ్ సోడాను ఉపయోగించడం చక్కటి మార్గంగా చెబుతున్నారు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేయాలి. తర్వాత పండ్లను అందులో వేసి కనీసం 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే.. క్రిములన్నీ తొలగిపోతాయి. 2017లో "మసాచుసెట్స్ యూనివర్సిటీ" నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. బేకింగ్ సోడా ద్వారా పండ్లపై ఉన్న రసాయనాలను తొలగించుకోవచ్చని తేలిందట. ఈ రీసెర్చ్‌కు సైంటిస్ట్ "లిలీ హీ" నాయకత్వం వహించారు.
వెనిగర్ : ఫ్రూట్స్ క్లీన్ చేయడానికి ఇది కూడా అద్భుతమైన మార్గం. ఒక గిన్నెలో మూడు వంతుల నీరు.. ఒక వంతు వైట్ వెనిగర్ తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను అందులో వేసి 10 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని చేత్తో రుద్దుతూ శుభ్రమైన నీటితో క్లీన్ చేసుకోవాలి.
సేంద్రియ ఉత్పత్తులు : ఈ రోజుల్లో ప్రతి పంటనూ పురుగు మందులతోనే సాగు చేస్తున్నారు. కాబట్టి.. ఏ మాత్రం అవకాశం ఉన్నా సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అవి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని చెబుతున్నారు.
పసుపు, ఉప్పు : చక్కగా క్లీన్ చేయడానికి మరో మంచి మార్గం పసుపు ఇంకా ఉప్పు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి.. ఆ నీటిలో పండ్లను అరగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత కాస్త పసుపును పండ్లకు అప్లై చేసి, శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి.
ముఖం, మెడమీద పులిపిర్లు ఇబ్బందిగా ఉన్నాయా - ఈ సింపుల్ చిట్కాలతో క్లియర్ చేసేయండి!