How To Reduce Itchy Scalp : తలలో దురద అనేది తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య. ఇంట్లో అయితే ఫర్వాలేదు కానీ, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వాళ్లను ఈ సమస్య మరీ ఇబ్బంది పెడుతుంది. దురద కారణంగా చదువు మీద, చేసే పని మీద అస్సలు శ్రద్ధ పెట్టలేరు. ధ్యాసంతా దురద మీదే ఉంటుంది. ఎవరికీ తెలియకుండా గోక్కోవడం ఎలా అనే దాని మీదే మీ మైండ్ ఉంటుందన్నది వాస్తవం. దీనికి తోడు ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో అనే భయం కూడా.
తలలో దురద కారణంగా ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు తలలో దురద రావడానికి కేవలం చండ్రు, చెమట మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. ఈ సమస్య రావడానికి వేరే ఇతర కారణాలూ చాలానే ఉన్నాయట. అవేంటో, వాటికి పరిష్కారాలేంటో తెలుసుకుందాం రండి.
తలలో దురదకు కారణాలు!
తరచూ తలలో దురద రావడానికి బాగా చెమట పట్టడం, చుండ్రు మాత్రమే కాకుండా ఇవీ కూడా కారణమవుతాయి.
- మాడు పొడిబారటం
- PH అసమతుల్యత
- ఒత్తిడి
- హార్మోన్లలో మార్పులు
- పేళ్లు
- ఫంగల్ ఇన్ఫెక్షన్స్
- బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా కారణమవుతాయి.
దురదను తగ్గించే మార్గాలు!
వస్తువుల వాడకంలో జాగ్రత్త
తలలో దురద సమస్య ఉన్నవారు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే- మీరు వాడే టవల్, దువ్వెన, దిండు, టోపీ, లాంటివి వేరే వారితో పంచుకోవడం. ఇలా చేయడం వల్ల ఎదుటి వారి తలలో ఉన్న దురద, పేళ్లు, చండ్రు లాంటి సమస్యలు మీకు రావచ్చు లేదా మీవి వారికి అంటవచ్చు. ఇద్దరికీ సమస్య ఉన్నా సరే వారి తల, మీ తల వేరు వేరు పోషకాలు, హార్మోన్లు, శక్తిని కలిగి ఉంటుంది కనుక సమస్య తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. అందుకే తలకు సంబంధించి ఏ వస్తువైనా సొంతంగా ఉంచుకోవాలి. ఇతరులతో పంచుకోవద్దు.
అప్పుడప్పుడైనా అలోవెరా
కలబంద అనేది ప్రకృతి అందించే సహజ సిద్ధమైన ఔషధం. ముఖ్యంగా తలలో దురద సమస్య ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లోని మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పొడిబారిన మీ తలను మృదువుగా, ఆరోగ్యంగా మార్చి దురదను తగ్గిస్తాయి. ఇందుకోసం మీరు పెరట్లోని కలబంద మొక్కలోని గుజ్జును తీసుకుని తలంతా చక్కగా పట్టించండి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఎక్స్ఫోలియేట్ చేయడం మర్చిపోవద్దు
మీ ముఖానికి, శరీరానికి ఎక్స్ఫోలియేషన్ ఎంత ముఖ్యమైనదో మీ తలకు కూడా ఇది చాలా అవసరమైన ప్రక్రియ. తరచుగా మీ తలను ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల తలలోని అదనపు నూనె, మృతకణాలు లాంటివి తొలగిపోతాయి. ఫలితంగా దురద సమస్య తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును పొందుతారు.
షాంపూలకు బదులు హెయిర్‌మాస్క్
వెంట్రుకలు, తల ఆరోగ్యానికి హాని కలిగించే షాంపూలకు బదులుగా మీరు హెయిర్ మాస్క్ వేసుకోవడం మంచిది. ఇవి తలకు మంచి నరిష్మెంట్ అందించడమే కాకుండాృ పోషణను అందిస్తాయి. మార్కెట్లో దొరికే హెయిర్మాస్కుల కన్నా మీరే స్వయంగా మీ ఇంట్లోని పెరుగు, గుడ్డు, నిమ్మరసం, యాపిల్ సైడర్, వెనిగర్, పుదీనా, వేప లాంటి సహజమైన పదార్థాలతో ప్యాక్ తయారు చేసుకుని వేసుకుంటే మంచి ఫలితాలను పొందగలరు.
మసాజ్ మర్చిపోకూడదు
తలలో రక్త ప్రవాహం చక్కగా జరగాలన్నా, సహజమైన నూనెలు తలంతా సమానంగా అందాలన్నా తలకు మసాజ్ తప్పనిసరి. తరచూ మర్దన చేసుకోవడం వల్ల వెంట్రుకల మూలాలకు పోషకాలు అందటమే గాక, తల ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో దురద సమస్య తగ్గుముఖం పడుతుంది.
తలస్నానం చేసేటప్పుడు ఇలా చేయకండి
బిజీబిజీ పనుల కారణంగా బయటకు వెళ్లేటప్పడు హడావిడిగా తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ జుట్టులోని మురికి, జిడ్డు సరిగ్గా వదలక చుండ్రు, దురద లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి సమయం లేనప్పుడు హడావిడిగా తలస్నానం చేయడం మానుకోండి. ఒకవేళ చేసి వెళ్లినా తిరిగి వచ్చిన వెంటనే తలను శుభ్రంగా కడుక్కోండి.
కఠినమైన షాంపూలు నూనెలు
మార్కెట్లో దొరికే చాలా రకాల షాంపూలు, నూనెల్లో హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి తలను ఆరోగ్యంగా ఉంచడం కాదు కదా కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. మాడు పొడిబారి దురద రావడానికి ఇవే కారణం అయి ఉండచ్చు. కాబట్టి వీటిని వాడే ముందు అప్రమత్తత పాటించండి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ 4 అలవాట్లతో - షుగర్ ఉన్నవారి లైఫే డేంజర్‌లో పడిపోతుంది! - Precautions For Diabetes
గర్భవతులు బొప్పాయి, పైనాపిల్ తినొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? - Can pregnant women eat papaya