Weight Loss Tips in Winter Season: ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఫలితంగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో శరీరంలో జీవక్రియల పనితీరు మందగించి కొవ్వు కరిగే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా కొవ్వు నిల్వలు పెరిగిపోయి క్రమంగా బరువు పెరిగి లేనిపోని అనారోగ్యాలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవక్రియల పనితీరును ప్రేరేపించే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా జీర్ణక్రియ వేగవంతమై.. శరీరంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించి త్వరగా బరువు తగ్గేలా చేస్తుందని వివరిస్తున్నారు. 2019లో Journal of Medicinal Foodలో ప్రచురితమైన "Curcumin Ameliorates Diet-Induced Obesity by Modulating Gut Microbiota and Improving Insulin Sensitivity" అధ్యయనంలోనూ తేలింది. అందుకే రోజూ పసుపును వంటకాల్లో భాగం చేసుకోవడమే కాకుండా దాంతో తయారుచేసిన టీ, డీటాక్స్ వాటర్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ఇంకా చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణాలు దాల్చిన చెక్కలో చాలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇది జీవక్రియల పనితీరును వేగవంతం చేసి పదే పదే ఆకలేయడాన్ని నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా ఏది పడితే అది తినకుండా జాగ్రత్తపడి బరువూ తగ్గుతారని తెలిపారు. ఇందుకోసం ఉదయాన్నే పాలల్లో టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
- మిరియాలలోని పైపెరిన్ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడంతో పాటు జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మిరియాలతో చేసిన టీని ఉదయాన్నే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్న మిరియాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో స్థూలకాయం బారిన పడకుండా జాగ్రత్తపడచ్చని సలహా ఇస్తున్నారు.
- శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా ఉండాలంటే యాలకులు రోజూ తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట తాగే టీలో యాలకులు వేసుకోవడం, వంటకాల్లో భాగం చేసుకోవడం, నేరుగా వాటిని నమలడం ఇలా ఎలాగైనా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంకా యాలకులు జీర్ణశక్తి ఆరోగ్యాన్ని పెంచడంలోనూ సమర్థంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.
- ఎండు మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీవక్రియల్ని వేగవంతం చేయడమే కాకుండా గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుందని వివరిస్తున్నారు.
- మెంతుల్లో ఉండే గలాక్టోమనన్ అనే నీటిలో కరిగే సమ్మేళనం ఆహారపు కోరికల్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువును అదుపులో ఉంచుతుందని వివరిస్తున్నారు. కాబట్టి పరగడుపునే గ్లాసు నీటిలో కాస్త మెంతి పొడిని కలుపుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే రాత్రంతా మెంతులు నానబెట్టిన నీళ్లు ఉదయాన్నే పరగడుపున తాగి ఆ మెంతుల్ని నమిలినా చక్కటి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
- ముఖ్యంగా దీర్ఘకాలంలో స్థూలకాయం బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచే జీలకర్రను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి.. పరగడుపునే ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
యూరిక్ యాసిడ్ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ పాటిస్తే 'గౌట్' తగ్గిపోతుందట!
డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలా? ఇలా చేస్తే ఈజీగా నాజుగ్గా మారిపోతారట!