Bad Breath Treatment as Per Ayurveda: నోటి దుర్వాసన చాలా మందిని వేధించే సమస్య. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం.. ఆహారం తీసుకున్నాక నోరు సరిగ్గా కడుక్కోకపోవడం.. వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య కారణంగా నలుగురిలోకి వెళ్లినప్పుడు మాట్లాడలేకపోతారు. దీని వల్ల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. మరి మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారా? అయితే.. ఎటువంటి లిక్విడ్స్, మౌత్‌వాష్ వాడకుండానే బ్యాడ్ బ్రీత్‌ను కంట్రోల్ చేసుకునేందుకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవి. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ ఔషధం తయారు చేసుకోవచ్చంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
- 25 గ్రాముల యష్టిమధు చూర్ణం
- 25 గ్రాముల వేయించిన జీలకర్ర చూర్ణం
- 25 గ్రాముల సోంపు పొడి
- 25 గ్రాముల వేయించిన నువ్వులు
- 10 గ్రాముల జాజికాయ చూర్ణం
- 25 గ్రాముల పటికబెల్లం చూర్ణం
- 25 గ్రాముల సైంధవలవణం చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో యష్టిమధు చూర్ణాన్ని వేసుకోవాలి.
- ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి, సోంపు పొడి వేసుకోవాలి.
- అనంతరం వేయించిన నువ్వులు, జాజికాయ చూర్ణం, పటికబెల్లం చూర్ణం, సైంధవలవణం చూర్ణం వేసుకుని బాగా కలిపితే ఔషధం తయారవుతుంది.
- నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ఉదయం, సాయంత్రం.. ఆహారం తీసుకున్న వెంటనే ఒక అర చెంచాడు చూర్ణాన్ని నోట్లో వేసుకుని చప్పరించాలి.
- చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవాళ్లలో కాస్త నెమ్మదిగా ప్రభావం చూపినా.. మిగిలిన వారిలో త్వరగానే పరిష్కారం అవుతుందని చెప్పారు.
ప్రయోజనాలు:
యష్టిమధు: నోట్లో అల్సర్, పుండ్లు, కడుపులో జీర్ణ శక్తి సరిగ్గా లేకపోయినా మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జీలకర్ర: జీలకర్ర నోట్లో లాలాజలం ఉత్పత్తి చేసేలా చేస్తుందట. ఇలా లాలాజలం ఎక్కువగా ఊరడం వల్ల బ్యాక్టీరియా పేరుకోకుండా ఉంటుందని చెబుతున్నారు.
సోంపు: సాధారణంగానే భోజనం పూర్తికాగానే సోంపు వేసుకుంటారు. సోంపును వేసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని.. అలాగే దుర్వాసన పోయేలా సాయం చేస్తుందని చెబుతున్నారు.
జాజికాయ: నోటి దుర్వాసన సమస్యను తగ్గించడానికి జాజికాయ చాలా దోహదం చేస్తుందని.. అలాగే నోట్లో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, లాలాజలం ఊరడానికి కూడా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
సైంధవలవణం: సైంధవలవణం లాలాజలం ఊరడానికి, ఇన్ఫెక్షన్లు పోవడానికి ఉపయోగపడతాయని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త - మిమ్మల్ని ఈ వ్యాధులు ఎటాక్ చేసే ఛాన్స్! - salt side effects on body"