How To Get Rid Of Ants At Home : వర్షాకాలంలో కీటకాలతోపాటు, చీమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌లోని పాలు, పెరుగు, అన్నం, చక్కెర వంటి ఆహార పదార్థాలపై ఎక్కువగా చీమలు చేరుతుంటాయి. అయితే.. చాలా మంది చీమలను తరిమికొట్టడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల స్ప్రేలు, కెమికల్ పౌడర్స్‌ని ఉపయోగిస్తుంటారు. వీటివల్ల చీమలు చనిపోవడమేమో గానీ, మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలున్న ఇంట్లో ఇలాంటి వాటిని వాడటం అస్సలు మంచిది కాదని అంటున్నారు. కొన్ని నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా చీమలను తరిమికొట్టవచ్చని సూచిస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెనిగర్, ఉప్పు : కప్పు నీటిలో టేబుల్ స్పూన్ ఉప్పు, వెనిగర్ యాడ్ చేసి.. ఈ మిశ్రమంలో ఒక వస్త్రాన్ని ముంచి కిచెన్‌లోని టైల్స్, ఫ్లోర్, సింక్ చుట్టూ తుడవాలి. అలాగే స్టౌ దగ్గర కూడా తుడవాలి. దీంతో చీమలను కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క : ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నచోట కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లాలి. అలాగే దాల్చిన చెక్క ఆయిల్‌ని స్ప్రే చేసినా కూడా చీమలను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2019లో 'journal of Emerging investigators'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. దాల్చిన చెక్క నూనె చీమలను తరిమికొట్టడానికి ప్రభావవంతంగా పని చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని వర్జీనియాలో హెన్లీ మిడిల్ స్కూల్‌కు చెందిన 'డాక్టర్ జోసెఫ్ టి' పాల్గొన్నారు.
పసుపు, నల్ల మిరియాలతో : ముందుగా ఒక గిన్నెలో టీస్పూన్ పసుపు, కొన్ని నల్ల మిరియాలు వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని కిచెన్‌లోని అన్ని మూలల్లో, ఆహార పదార్థాలను పెట్టే చోట స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే చీమలు రాకుండా అడ్డుకోవచ్చు.
ఎర్ర మిరపకాయలు : ఎర్ర మిరపకాయలు కొన్ని నానబెట్టి మెత్తని పేస్ట్‌లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని చీమలు ఎక్కువగా ఉండే మూలల్లో కొద్దిగా పెట్టాలి. దీనివల్ల చీమలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే మిశ్రమాన్ని నీటిలో వేసి మరిగించిన వాటర్‌ని స్ప్రే చేయడం వల్ల కూడా చీమలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పుదీనా వాటర్ : కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ వాటర్ చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో పోసి చీమలపై స్ప్రే చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసంతో : చీమలు తిరిగే ప్రదేశాలలో నిమ్మరసాన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా వాటిని తరిమి కొట్టవచ్చని నిపుణులంటున్నారు.
ఉప్పు: ఉప్పు కూడా చీమల బెడదను తగ్గిస్తుంది. అవి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కొద్దిగా చల్లడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి :
కిచెన్‌లో ఈగలు, కీటకాల సమస్య ఎక్కువగా ఉందా? - ఈ టిప్స్‌తో ఒక్కటి కూడా కనిపించదు!