Kidney Cancer Warning Signs : మన బాడీలో కిడ్నీలు(Kidneys) చాలా కీలకమైన అవయవాలు. అవి నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ.. వ్యర్థాలను వడగట్టి యూరిన్ ద్వారా బయటకు పంపుతాయి. కాబట్టి, కిడ్నీల్లో చిన్న సమస్య తలెత్తినా పెద్ద చిక్కులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కిడ్నీ క్యాన్సర్ చాలా పెద్ద సమస్య. దీని బారినపడకుండా ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని లక్షణాలు కనుక మీలో కనిపిస్తే అది మూత్రపిండ క్యాన్సర్ కావొచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కిడ్నీ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు :
కిడ్నీ క్యాన్సర్‌కు సంబంధించిన ముందస్తు లక్షణాలను విస్మరించకూడదంటున్నారు దిల్లీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ ఆదిత్య నరైన్. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటంటే..
- పొత్తికడుపు పైభాగంలో పెయిన్(పార్శ్వ నొప్పి)
- లో బ్యాక్ పెయిన్(ఒక వైపు మాత్రమే)
- మూత్రంలో రక్తం(హెమటూరియా)
- వివరించలేని బరువు తగ్గడం
- అధిక రక్తపోటు
- ఎముక నొప్పి
- జ్వరం
- ఆకలి లేకపోవడం
ఇవన్నీ కిడ్నీ క్యాన్సర్ సాధారణ లక్షణాలు కావొచ్చని డాక్టర్ తుషార్ ఆదిత్య నరైన్ చెబుతున్నారు. 2021లో 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మూత్రంలో రక్తం పడే వ్యక్తులలో కిడ్నీ క్యాన్సర్ నిర్ధారణ అయ్యే అవకాశం 50% ఎక్కువ. అయితే, చాలా మందిలో పైన పేర్కొన్న లక్షణాలు తొలినాళ్లలో కనిపించకపోవచ్చు. కాబట్టి, ఈ లక్షణాలను ముందస్తుగా గుర్తించడానికి.. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, ధూమపానం చేసేవారు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
నీళ్లు తక్కువ తాగితే కిడ్నీలకు డేంజర్ - మరి ఎక్కువగా తాగితే?
వ్యాధి నిర్ధారణ : సీటీ స్కాన్, అబ్డామినల్, సీబీసీ, కిడ్నీ అల్ట్రా సౌండ్, యూరిన్ ఎగ్జామినేషన్, బయాప్సీ వంటి పరీక్షల ద్వారా కిడ్నీ క్యాన్సర్‌ని నిర్ధారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చికిత్స ఎంపికలు : మూత్రపిండ క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స అనేది.. వ్యాధి దశపై ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ట్యూమర్ దశ, గ్రేడ్, పేషెంట్ వయస్సు, వారి సాధారణ ఆరోగ్యం.. కిడ్నీ క్యాన్సర్ చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే.. వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా అవసరమని చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి శస్త్రచికిత్స నుంచి కెమోథెరపీ వరకు పలు రకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
క్రియాటినిన్ పెరిగితే కిడ్నీలు ఖతమే - ఇలా నేచురల్‌గా తగ్గించుకోండి!