How to Cure PCOS in Telugu : ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి.. పీసీఓఎస్(పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్). శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, ఇన్సులిన్ స్థాయులు పెరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. తద్వారా స్త్రీలలో నెలసరి సక్రమంగా రాకపోవడం, సంతానలేమి, అధిక బరువు, మొటిమలు, అవాంఛిత రోమాలు వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి, పీసీఓఎస్ సమస్యను ఎంత త్వరగా నయం చేసుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు మందులు వాడుతుంటారు. అయితే, మందులతో పీసీఓఎస్ పూర్తిగా తగ్గుతుందా? లేదంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పీసీఓఎస్ అనేది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ మల్టీ సిస్టమ్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అంటే.. వివిధ కారణాల వల్ల శరీరంలోని పలు వ్యవస్థల మీద దుష్ప్రభావం చూపడం. కాబట్టి, పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వై. సవితాదేవి. ఇందుకోసం డాక్టర్ సూచించిన మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా అవసరమంటున్నారు. అంతేకానీ.. ఒకట్రెండు నెలలు మందులు వాడటం వల్ల తేలికగా తగ్గిపోయే సమస్య కాదని చెబుతున్నారు.
అందుకే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే.. మందులు వాడడంతో పాటు చక్కటి జీవనశైలి, పోషకాహారం, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ బరువును నియంత్రణలో పెట్టుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం లాంటివి ముఖ్యంగా పాటించాల్సిన అంశాలని పేర్కొంటున్నారు డాక్టర్ సవితాదేవి. వీటితో పాటు డైలీ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు.
వీటికి దూరంగా ఉండాలి : పీసీఓఎస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడమే కాదు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అందులో.. బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగుల్ని తీసుకోవాలని, వంటకాలలో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
అయితే పీసీఓఎస్‌లో ఉండే హార్మోన్ల అసమతుల్యతను, మెటబాలిక్ సమస్యల్ని సరిచేయడానికి చక్కని మందులు ఉన్నాయి. అలాగే, గర్భం నిలవకపోతే అండం విడుదల కోసం వాడడానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి ఫలితాలనిస్తాయి. కాబట్టి, పీసీఓఎస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండడం మంచిదంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
పీసీఓఎస్, పీసీఓడీ వేధిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు!
రీసెర్చ్: ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ తాగితే - బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుందా ?