How To Control Diabetes Without Medicine : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది చిన్న వయసులోనే షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇలా చిన్న వయసులోనే షుగర్ రావడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. అయితే.. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎటువంటి మందులు, ఇంజెక్షన్లూ వాడకుండానే.. డైలీ కొన్ని పనులు చేయడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచి జీవనశైలిని అలవాటు చేసుకోండి :
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, రోజూ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే బెర్రీలు, నారింజ పండ్లను తినాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వాటిని అస్సలు తీసుకోకూడదు. ఇంకా ఆహారంలో తృణధాన్యాలను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
షుగర్‌తో గుండెపోటు, బెయిన్ స్ట్రోక్‌కు ఛాన్స్.. ఈ సింపుల్ టిప్స్‌తో కంట్రోల్!
రోజూ వ్యాయామం :
షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు రోజూ శారీరక శ్రమను కలిగించే పరుగు, నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే బాడీ ఫిట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్" (JAMA) జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు 12 వారాల పాటు వారానికి 150 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డైలీ వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్. నందన జాస్తి (జనరల్ ఫిజిషియన్) చెబుతున్నారు.
బరువు తగ్గండి :
అధిక బరువుతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మంచి డైట్‌ను, వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి తగ్గించుకోండి :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒత్తిడితో బాధపడుతున్న వారిలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట. అందుకే.. షుగర్ వ్యాధితో సతమతమయ్యేవారు డైలీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకోవడం వల్ల ఎటువంటి మందులూ వాడకుండా షుగర్ లెవెల్స్‌ను నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.
హైడ్రేటెడ్ గా ఉండండి :
మధుమేహం ఉన్నవారు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి, రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. పైన తెలిపిన అన్ని చిట్కాలను పాటిస్తూనే ఎప్పటికప్పుడు, షుగర్ స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
Health Benefits Of Turmeric : చిటికెడు పసుపుతో ఎన్నో లాభాలు.. డయాబెటిస్ కంట్రోల్!
Control Sugar Levels : షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడం ఎలా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..