Home Remedies for Acidity: తిన్న తర్వాత కడుపులో, ఛాతిలో మండినట్లుగా ఉంటుంది. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంథి నుంచి అధిక ఆమ్లం ఉత్పత్తి అవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే.. ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందాలంటే ఈ టిప్స్ ఫాలో కావాలని చెబుతున్నారు నిపుణులు.
అల్లం : అల్లంలోని యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కడుపులో మంట తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే జింజెరల్ అనే పదార్థం ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎసిడిటీతో బాధపడేవారు తాజా అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టి, భోజనానికి ముందు లేదా తర్వాత టీ లాగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఛాతీ భాగంలో వచ్చే మంట, ఎసిడిటీ తగ్గుతాయని అంటున్నారు.
సోంపు: ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సోంపు గింజలు ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి తిన్న తర్వాత కాస్తా సోంపుని నమిలి తినడం లేదా నీటిలో మరిగించి తీసుకోవడం మంచిదంటున్నారు. ఇవి కడపులో మంటను తగ్గిస్తాయని చెబుతున్నారు. సోంపు బదులు జీలకర్ర కూడా వాడొచ్చని సూచిస్తున్నారు.
మజ్జిగ: మజ్జిగ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం ఆహారం జీర్ణం చేసేందుకు దోహదపడుతుందని.. తద్వారా కడుపులోని ఆమ్లత్వం తగ్గి మంట, నొప్పి వంటి లక్షణాలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఓ గ్లాసు మజ్జిగలో కొద్దిగా నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తాగితే మరింత ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.
తులసి: ఔషధాల గనిగా పేరొందిన తులసి మన ఆరోగ్యాన్ని రక్షించేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి యాంటీబయోటిక్‌గా పని చేస్తుంది.. తులసి ఆకులను నమలడం లేదా నీటిలో వేసి మరిగించి టీ లా చేసుకుని తాగితే.. ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుందని అంటున్నారు. అలాగే తులసి రసాన్ని రోజూ తాగటం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయంటున్నారు.
2014లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌డెసిప్లినరీ హెల్త్ సైన్సెస్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తులసి ఆకులను తినడం వల్ల కడుపులో మంట, వికారం వంటి ఎసిడిటీ లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ సింగ్ పాల్గొన్నారు.
బెల్లం: బెల్లం ముక్క చూడగానే నోరూరుతుంది. అయితే.. ఇది రుచితో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. తిన్న ఆహారం జీర్ణం కాకున్నా, కడుపులో మంటగా ఉన్నా ఓ చిన్న బెల్లం ముక్క తింటే త్వరిత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
నిమ్మరసం: ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం, ఓ చెంచా తేనె కలిపి తాగితే కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ తగ్గుతుందని.. తద్వారా ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
పాలు: చల్లని పాలు తీసుకున్నా కడుపులో ఇబ్బంది తగ్గుతుందని అంటున్నారు. చక్కెర కలపని ఓ గ్లాసు చల్లని పాలు తాగితే కడుపులో మంట తగ్గుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.