Health Problems Shown By Nails : మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనే విషయాన్ని మన శరీరంలోని అవయవాలు ఎప్పటికప్పుడు సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటాయి. కానీ.. మెజారిటీ జనాలు వాటిని పసిగట్టలేరు. కొందరికి తెలిసినా లైట్ తీసుకుంటారు. సమస్య తీవ్రమైన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తారు. అప్పుడు డాక్టర్ మన కళ్లు, గోళ్లు చూసి అనారోగ్య సమస్యల గురించి చెబుతుంటారు. గోళ్ల రంగు, రూపు రేఖలలో వచ్చే మార్పులు.. హెల్త్ ప్రాబ్లమ్స్‌కు ముందస్తు సంకేతాలని నిపుణులంటున్నారు. అందుకే గోళ్లలో వచ్చే మార్పులను చెక్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గోళ్లు పాలిపోయి ఉంటాయి :
బాడీలో ఐరన్ శాతం తక్కువగా ఉన్నవారి గోళ్లు పాలిపోయి ఉంటాయి. అలాగే రక్తహీనత, గుండెజబ్బులు, కాలేయ సమస్యలతో బాధపడేవారి గోళ్లు కూడా పాలిపోయి ఉంటాయని నిపుణులంటున్నారు. 2016లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. ఐరన్ లోపంతో బాధపడుతున్న మహిళల్లో గోళ్లు పాలిపోవడం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో 'హెల్త్ సైన్స్ సెంటర్'లో ప్రొఫెసర్‌గా పని చేసే 'డాక్టర్ సుసాన్' పాల్గొన్నారు. ఐరన్ లోపం ఉన్న మహిళల గోళ్లు పాలిపోయి ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
పసుపు రంగులో ఉంటే :
మధమేహం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారి గోళ్లు పసుపు రంగులో ఉంటాయట. అలాగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారిలో కూడా ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.
నీలం రంగులో ఉంటే :
మన శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోతే గోళ్లు నీలం రంగులోకి మారతాయట. ఇంకా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే కొందరిలో కూడా ఇలా గోళ్లు రంగు మారే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
గోళ్లపై చంద్రవంక ఆకారం ఏ రంగులో ఉండాలి ?
చాలా మంది గోళ్లపైన కింది భాగంలో అర్థచంద్రాకారంలో తెల్లగా ఉంటుంది. దీనిని "లూనులా" అని అంటారు. ఆరోగ్యంగా ఉన్నవారిలో లూనులా తెల్లగా ఉంటుందని నిపుణులంటున్నారు. అయితే.. కొంతమందిలో ఇది లేత గులాబీ రంగులో కూడా ఉంటుందట. అలా కాకుండా.. ఎరుపు, నీలం వంటి రంగుల్లోకి మారితే కొన్ని అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలట.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.